కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం | Governor approval for new MLCs | Sakshi
Sakshi News home page

కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

Published Tue, Jun 15 2021 3:32 AM | Last Updated on Tue, Jun 15 2021 9:41 AM

Governor approval for new MLCs - Sakshi

సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. వీరితో కలుపుకుంటే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 18కి పెరుగుతుంది. అంతకుముందు.. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. మరోవైపు.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కలవకముందే ప్రతిపాదిత పేర్లకు ఆమోదం తెలిపినట్లు గవర్నర్‌ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. కాగా, తమ నియామకానికి తోడ్పడిన సీఎం వైఎస్‌ జగన్, గవర్నర్‌కు కొత్త ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. 

సేవలకు గుర్తింపుగా: గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి వైస్‌ జగన్‌ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.



► పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

► ఇక తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. 

► అలాగే, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్‌ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement