వరుస దుర్ఘటనలు జరుగుతున్నా సర్కారు సమీక్షించడంలేదు
పోలీసులు కూడా ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ
బద్వేలు అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..
హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగిరమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా మునిగిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీట
ఇక గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్‌ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment