సాక్షి, అమరావతి: రైతులు పండించే పంటకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల (బహుళ ప్రయోజన కేంద్రాల) నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. వీటిలోనే డ్రైయింగ్ యార్డ్స్ (ఆరబోత కళ్లాలు) సహా 500 నుంచి 1,000 మెట్రిక్ టన్నుల మేర పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంతో తొలి దశలో 1,255 గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. పంటలను ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌తో కలిపి ఒక్కో గోదామును ఆర ఎకరం విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,700 కోట్లతో గ్రామీణ గోదాముల నిర్మాణాలను నాలుగు దశల్లో చేపట్టాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. వీటిలోనే అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు
రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా వర్గీకరించి తొలి దశలో రూ.579.33 కోట్లతో 1,255 గోదాములను నిర్మిస్తారు. ఇప్పటికే ఒక ప్యాకేజీ కింద గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 219 గ్రామాల్లో రూ.67.40 కోట్ల వీటిని నిర్మించేలా టెండర్లు ఆహ్వానించారు. మరో ప్యాకేజీగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగం జిల్లాల్లోని 92 గ్రామాల్లో రూ.27.98 కోట్లతో గోదాములు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. ఈ రెండు ప్యాకేజీలకు వచ్చే నెల 18న సాంకేతిక బిడ్స్ తెరుస్తారు. వచ్చే నెల 21వ తేదీన ప్రైస్ బిడ్ తెరిచి అదే రోజున రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు.
ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఈ ప్యాకేజీల విలువ రూ.వంద కోట్ల లోపే ఉండటంతో ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లను ఆహ్వానించారు. వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక ప్యాకేజీ కింద రూ.208.80 కోట్లతో 514 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ డాక్యుమెంట్‌ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. అదేవిధంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో ప్యాకేజీ కింద రూ.161.15 కోట్లతో 430 గ్రామాల్లో గోదాములు నిర్మాణాలకు టెండర్ల డాక్యుమెంట్‌ను మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసింది. ఈ రెండు ప్యాకేజీల టెండర్ల విలువ రూ.వంద కోట్లకు పైబడి ఉండటంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది.
పరికరాల సరఫరాకూ..
మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో రైతులకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచేందుకు కూడా మార్కెటింగ్ శాఖ రూ.114 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించింది. రూ.70 కోట్లను మల్టీ గ్రెయిన్‌న్ డీ–స్టోనర్ కమ్ క్లీనర్, పీటీవో ఆపరేటెడ్ మొబైల్ ప్యాడీ డ్రైయర్స్ సరఫరా కోసం వెచ్చిస్తారు. రూ.44 కోట్లను అసైయింగ్ యూనిట్లు, ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్ పరికరాల సరఫరాకు వినియోగిస్తారు. ఈ పరికరాల సరఫరాకు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు.
నాలుగు దశల్లో నిర్మాణాలు పూర్తి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను రైతులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు దశల్లో మొత్తం ఈ కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. తొలి దశలో ఇప్పటికే రెండు డివిజన్లలో టెండర్లను ఆహ్వానించాం. మరో రెండు డివిజన్లలో టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేందకు సిద్ధం చేశాం.
– ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment