‘ఫేషియల్‌ అథంటికేషన్‌’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే | Green Signal To Use Aadhaar Face Authentication In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఫేషియల్‌ అథంటికేషన్‌’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే

Published Sat, Oct 1 2022 8:25 AM | Last Updated on Sat, Oct 1 2022 3:01 PM

Green Signal To Use Aadhaar Face Authentication In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్‌ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్‌ అథెంటికేషన్‌’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్స్‌ సెంటర్‌) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్‌ ఫేషియల్‌ అథంటికేషన్‌ వినియోగిస్తున్నారు.

నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్‌ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్‌ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది.

ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్‌ అథంటికేషన్‌ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్‌ చేయగానే అది ఆధార్‌కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 

80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. 
ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్‌ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్‌ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్‌ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్‌ స్థానంలో ఐరిస్‌ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్‌ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్‌లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్‌ ఫేషియల్‌ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌కు చెల్లించాల్సిన అవసరం ఉండదు.  ఆధార్‌ బేస్డ్‌ ‘ఫేషియల్‌ అథంటికేషన్‌’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి.  

ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. 
ఈ రెండు విధానాలు అధార్‌ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్‌ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్‌ స్థానంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్‌ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్‌ ఫేషియల్‌ అథంటికేషన్‌ వినియోగానికి ఆమోదం లభించింది.  

సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్‌’  
ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్‌ అనుసంధానంతో కూడిన ఫేషియల్‌ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్‌ యాప్‌లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్‌ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్‌ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్‌ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement