సాక్షి, అమరావతి: ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్‌మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా అప్‌డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేస్తోంది.
చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment