వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన జీఎస్టీ వసూళ్లు
చంద్రబాబు పాలనలో పాతాళం దిశగా పరుగులు
గతేడాది ఆగస్టుతో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణత
రూ.3,298 కోట్లకు పరిమితమైన జీఎస్టీ వసూళ్లుజూలైలో కూడా 7 శాతం క్షీణత
కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి
వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోవడమే కారణమంటున్న ఆర్థిక నిపుణులు
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది.
మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతి
నాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధి
కోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది.
అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది.
బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.
ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment