సాక్షి, అమరావతి: విశాఖపట్నం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆహ్వానించారు. బుధవారం ముంబైలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రను పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు.
గురువారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు.
సంస్కృతి ఉట్టిపడేలా ఇన్విటేషన్ కిట్లు..
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇన్విటేషన్ కిట్స్’ను సిద్ధం చేసింది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆహ్వానితులను కలిసినప్పుడు కలంకారీ వర్క్‌తో చేసిన ఉప్పాడ శిల్క్ శాలువతో సత్కరించి, స్వరోవ్‌స్కీ క్రిస్టల్‌తో చేసిన రాష్ట్ర పక్షి రామ చిలుక ప్రతిమను అందించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నారు.
సదస్సుకు ఆహ్వానిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సహజ వనరులు, మానవ వనరులు తదితరాలతో ముద్రించిన బ్రోచర్‌ను కూడా కిట్‌తో పాటు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment