‘చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత క్యూలైన్‌లో నిల్చున్నాం.. లారీలపై ఉన్న వలంటీర్లు కానుకలను కిందకు విసరడంతో టోకెన్ లేకపోయినా ఇస్తున్నారంటూ అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.. కానుకలు విసరడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నా కుమార్తె గాయపడగా నేను అదృష్టవశాత్తూ బయటపడ్డా...’
– విచారణ కమిటీ ఎదుట గుంటూరుకు చెందిన రాఘవి వాంగ్మూలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నూతన ఏడాది తొలిరోజు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై బాధితులు, ప్రత్యక్ష సాక్షులు గురువారం విచారణ కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జనవరి 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే.
కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. గుంటూరులో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కమిషన్ మైదానం సామర్థ్యం, ఎంత మంది ఉన్నారు? తొక్కిసలాట ఎలా జరిగింది? అనే అంశాలపై కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌లతోపాటు బాధితులు, నిర్వాహకులను ఆరా తీసింది.
సభ జరిగిన ప్రదేశం కొలతలు సేకరించింది. ఎంత మందికి కానుక టోకెన్లు ఇచ్చారు? పంపిణీ వద్ద ఎంతమంది ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో విచారణ కొనసాగించారు. గాయపడ్డ వారు, మృతుల కుటుంబీకుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
తక్షణమే స్పందించడంతో..
తాము 60 క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి 12 మాత్రమే ఏర్పాటు చేశారని వివరించారు. బారికేడ్లలో ఒక్కో క్యూలైన్ వెడల్పు ఐదు అడుగులకుపైగా ఉండటంతో కానుకలు తీసుకుని వెనక్కి వచ్చే వారు ఇరుక్కుపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. తాము వెంటనే స్పందించి కానుకల పంపిణీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో బాధ్యతలు నిర్వహించిన పోలీసు అధికారులు కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు.
అంతా ఒకే లైన్‌లోనే..
చంద్రబాబు సభ ముగిసే వరకు చీరల పంపిణీ వద్దకు ఎవరిని వెళ్లనివ్వలేదు. సభ ముగిసిన తరువాత వెళితే ఒక కౌంటర్‌లో ఐదు వేల మందికిపైగా ఉన్నారు. ఒకే లైన్ ద్వారా వెళ్లటం, తిరిగి బయటకు రావటంతో ఇరుక్కుని తొక్కిసలాట జరిగింది. కళ్ల ముందే ఎంతో మంది గాయాలపాలయ్యారు. నిర్వహణ సరిగా లేకపోవటంతోనే తొక్కిసలాట జరిగింది.
– గుంటముక్కల సౌందర్య (స్వర్ణభారతినగర్)
అక్కా అంటూ ఆప్యాయంగా..
మా ఇంటి పక్క వీధిలో నివసించే షేక్ బీబీ తొక్కిసలాటలో మృతి చెందింది. అక్కా అని ఎంతో అభిమానంగా ఉండేదాన్ని. తొక్కిసలాటలో కళ్ల ముందే చనిపోవటాన్ని మరవలేకపోతున్నా. నేను స్పహ కోల్పోయి రెండు రోజుల పాటు ఐసీయూలో కోమాలో ఉన్నా. వెన్నుపూస దెబ్బతిని నరకం అనుభవిస్తున్నా.
– తెల్లమేకల రంగాదేవి (మారుతీనగర్)
కాలు విరిగింది..
సభకు వెళ్లిన వారిని మధ్యాహ్నం నుంచి కుర్చీల్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత ఒక్కసారిగా వదిలిపెట్టడంతో ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో నాకు కాలు విరగడంతో ఆపరేషన్ చేశారు. 15 రోజుల తరువాత అడుగు కిందకు పెట్టా. మాకు న్యాయం చేయాలి.
– షేక్ హుస్సేన్‌బీ (ఏటీ అగ్రహారం)
Comments
Please login to add a commentAdd a comment