పట్టణాలకు కొత్తరూపు | Guntur District Is Moving Towards Development Trajectory | Sakshi
Sakshi News home page

పట్టణాలకు కొత్తరూపు

Published Fri, Mar 5 2021 4:21 AM | Last Updated on Fri, Mar 5 2021 4:23 AM

Guntur District Is Moving Towards Development Trajectory - Sakshi

గుంటూరులో సరికొత్తగా దర్శనమిస్తున్న లాలుపురం రోడ్డు 

జిల్లాలో ప్రస్తుతం గుంటూరు నగరంతోపాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. విలీన గ్రామాల సమస్యల కారణంగా తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట మున్సిపాలిటీల్లోను, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్లోను ఎన్నికలు జరగడంలేదు. 

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో గుంటూరు నగరం, పట్టణాలు అభివృద్ధి పథం వైపు సాగుతున్నాయి. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక పట్టణాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. స్వచ్ఛ గుంటూరు, స్వచ్ఛ పట్టణాలుగా మార్చేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నగరంలోను, పట్టణాల్లోను గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఒక్క గుంటూరు నగరంలోనే 64 వేల మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 32 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమం వైపు మొగ్గు చూపించి అత్యధికశాతం వైఎస్సార్‌సీపీ అభిమానుల్ని గెలిపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లోను అవే ఫలితాలు పునరావృతం అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల పోటీచేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపక విపక్షాలు నిరాశలో మునిగిపోయాయి. 


పేరేచర్లలో ఇంటికి శంకుస్థాపన చేసి ప్రార్థన చేస్తున్న ముస్లిం కుటుంబం 

గుంటూరులో ప్రగతి పరుగులు
గుంటూరు నగరంలో రూ.34.31 కోట్లతో రోడ్ల విస్తరణ, మరమ్మతులు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో నగరంలో రూ.903 కోట్లతో పనులు చేపట్టినా కాంట్రాక్టు సంస్థతో కొంతమంది టీడీపీ పెద్దలు కుమ్మక్కై ముందే కమీషన్లు వసూలు చేశారు. ఫలితంగా పనులు పూర్తికాలేదు. యూజీడీ పనుల కోసం రోడ్లను తవ్వి వదిలేయడం వంటివి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించింది. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి పనులు పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రచించింది. రాష్ట్రంలోనే తొలిసారి గుంటూరులో ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. జిందాల్‌ ఆధ్వర్యంలో నాయుడుపేటలో 32 ఎకారల్లో వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేశారు. గాంధీ పార్కును రూ.6.5 కోట్లతో సుందరీకరిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.13.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రభుత్వాస్పత్రి, వైద్యకళాశాలల అభివృద్ధికి రూ.700 కోట్లతో పనులు మొదలయ్యాయి.

పురపాలక సంఘాల్లో..
తెనాలి మున్సిపాలిటీలో  21,152 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 1,856 టిడ్కో ఇళ్లు పేదలకు కేటాయించారు. అన్ని వార్డుల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రూ.240 కోట్లతో  తెనాలి –మంగళగిరి బైపాస్‌ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌ తరహాలో తెనాలిలో కెనాల్‌ బండ్‌కు ప్రణాళికలు రచిస్తున్నారు.
►చిలకలూరిపేట పట్టణంలో 8,714 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 3,248 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. అమృత్‌ పథకం కింద పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.139.80 కోట్లతో పనులు చేపట్టారు. పట్టణంలో రూ.46 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
►వినుకొండ పట్టణంలో 5,471 మందికి ఇళ్లస్థలాలు, 1,440 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. పట్టణంలో తాగునీటి సమస్యకు వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సింగర చెరువు (మంచినీటి చెరువు)ను 60 నుంచి 270 ఎకరాలకు విస్తరించి వేసవిలోనూ నీటి ఎద్దడి లేకుండా చేశారు.
►సత్తెనపల్లిలో 5,323 మంది పేదలకు ఇళ్లస్థలాలు, 160 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించారు. 
►రేపల్లె పట్టణంలో 3,088 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, 1,344 మందికి టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement