దాడుల దృశ్యాల వీడియోను విలేకర్లకు చూపుతున్న డీఐజీ త్రివిక్రమవర్మ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పల్నాడు జిల్లా మాచర్లలోని 16వ వార్డులో ఈ నెల 16వ తేదీన టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ చెప్పారు. గుంటూరులోని డీఐజీ కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘మాచర్ల 16వ వార్డు అత్యంత సున్నితమైన ఏరియా. అక్కడ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వర్తించే క్రమంలో పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. అలా ఇస్తే విధిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 16వ తేదీ సాయంత్రం 5.30 సమయంలో రెండు గ్రూప్‌ల మధ్య చోటు చేసుకున్న గొడవను విజిబుల్ ఎస్‌ఐ గుర్తించి, ఆందోళనకారులను చెదరగొట్టారు.
పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈలోగా రాళ్ల దాడి జరిగింది. ఒక వర్గం నుంచి చల్లా మోహన్, మరోవర్గం నుంచి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం. రెండు వీడియోలలో దాడి దృశ్యాలను ఆధారంగా చేసుకుని సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తాం’ అని డీఐజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment