సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్యానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైకోర్టుకు నివేదించింది. హత్య చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు పదునైన కత్తితో జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేసినట్టు సాక్షులు తమ వాంగ్మూలాల్లో తెలిపారని ఎన్‌ఐఏ వివరించింది. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడని, దాచిపెట్టేందుకు అనువుగా ఉండేలా ఆ కత్తిని ఎంచుకున్నారని తెలిపింది.
ప్రాణాంతక గాయం చేసేందుకు ఆ కత్తి సరిపోతుందని కోర్టుకు వివరించింది. ఈ కేసులో శ్రీనివాసరావు 9 సార్లు బెయిల్ పిటిషన్లు వేశారని, వాటన్నింటినీ న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపింది. జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో న్యాయస్థానాలు అతని బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చాయంది. హత్యాయత్నం కేసులో విశాఖ ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే ట్రయల్ మొదలు పెట్టిందని, కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయవద్దని అభ్యరి్థంచింది.
ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని తెలిపింది. అంతేకాక శ్రీనివాసరావు పారిపోతాడని, అతన్ని తిరిగి పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందని తెలిపింది. అందువల్ల అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని విన్నవించింది. జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏను ఆదేశించింది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్, ఈ కేసు దర్యాప్తు అధికారి బీవీ శశిరేఖ కౌంటర్ దాఖలు చేశారు. ఇదే సమయంలో శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు సీనియర్ న్యాయవాది త్రిదీప్ పైస్ స్పందిస్తూ, ఎన్‌ఐఏ కౌంటర్ తమకు అందిందని, దానిని పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment