నీట మునిగిన పీలేరు బస్టాండ్
పలు ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు
చిత్తూరు రూరల్/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.
⇒ చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు
రైతులు వాపోతున్నారు.
⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.
తిరుపతిలో భారీ వర్షం
భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది.
తిరుమలలో కూడా..
తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరి, టమాటా పంటలకు నష్టం
అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది.


