
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
కాగా, ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడి తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ పేర్కొంది. ఇక, తుపాన్‌గా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా..తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వెళ్తోంది. దీంతో, విజయవాడ జల దిగ్భందమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు.. తాజాగా వరదల కారణంగా 15 మంది మరణించినట్టు తెలుస్తోంది.