
సాక్షి, చిత్తూరు: తిరుమలలో గత రెండు రోజుకుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడుతోంది. కుండపోతగా కురుస్తున్న ఈ వర్షంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు వానలో తడిసిపోతున్నారు. అకాలవర్షం కారణంగా తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఏడుకొండలు తడిచి ముద్దువుతున్నాయి. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డు 54వ మలుపు వద్ద భారీ కొండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు భారీ కొండరాళ్లను తొలగించారు. రాత్రి సమయంలో వాహనాలకు అనుమతి లేకపోవడంతో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ, ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు మాత్రం మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. ఎడతెరిపిలేని ఈ వర్షాలకు ఎటువైపు నుంచి హఠాత్తుగా కొండచరియలు విరిగిపడుతాయో తెలియని ఆందోళన పరిస్థితి నెలకొంది. రెండవ ఘాట్రోడ్డులో కూడా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరొపక్క వర్షం కాస్త తగ్గుముఖం పడితే పొగమంచు తిరుమల గిరులు దుప్పటిలా అలుముకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment