ఏలూరు జిల్లా ఏపులపాడు సమీపంలో రహదారి మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని మొదట భావించినా తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అయినా దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఉత్తరాంధ్ర, గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో 6.9, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 6.8, అనకాపల్లి జిల్లాల్లో 6.4 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ సగటున 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
10 జిల్లాలకు రెడ్.. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నందున, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
జిల్లా కలెక్టర్ల అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు తెరవాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల ద్వారా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది.
2వ తేదీ నాటికి మరో అల్పపీడనం
అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్‌డీపీఎస్ అధికారులు చెబుతున్నారు.
రాయలసీమలో జడివాన
రాయలసీమ జిల్లాల్లో బుధవారం జడివాన కురిసింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది. కర్నూలు జిల్లాలో సగటున 18.8, నంద్యాల జిల్లాలో 22.9 మి.మీ వర్షం కురిసింది. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లాం వద్ద కొండవీటి వాగు, పెదపరిమి వద్ద గల కోటెళ్ల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. కొల్లిపర మండలంలో 80.2 మి.మీ వర్షం పడింది.
కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉగ్రరూపం
ఉమ్మడి కృష్ణా జిల్లాను వాన ముంచెత్తుతోంది. కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉగ్రరూపం దాల్చాయి. బుడమేరుకు వరద పోటెత్తింది. కంకిపాడు మండలం నెప్పల్లిలో అధిక వర్షాలకు గోడలు నానిపోయి రేకుల షెడ్డు కూలిపోవడంతో మేరి అనే మహిళ గాయపడింది. వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల గ్రామాల మధ్య వంతెనపైకి నీరు చేరింది.
వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దాములూరు మధ్య కూడలి వద్ద కట్టలేరుపై కాజ్‌వే పూర్తిగా మునిగిపోయింది. వీరులపాడు మండలం దొడ్డదేవర పాడు వద్ద కట్టలేరుపై ఉన్న వంతెనను తాకుతూ వరద వెళుతోంది. జి కొండూరు మండలం జి కొండూరు, కందులపాడు గ్రామాల మధ్య ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై తాత్కాలికంగా నిరి్మంచిన కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
వెనుదిరిగిన బోట్లు
ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జన జీవనానికి అంతరాయం కలుగుతోంది. తాళ్లపూడిలో 84.6 మిల్లీ మీటర్లు, సీతానగరంలో 55, రాజమండ్రి రూరల్‌లో 40.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కోటనందూరు మండలంలో 94.4 మి.మీటర్లు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బోట్లు నిలిచిపోయాయి. ట్యూనా చేపల కోసం వెళ్లిన బోట్లు వెనుదిరిగాయి. ఏలూరు జిల్లా పెదవేగి సమీపంలోని బలివే మార్గంలో తమ్మిలేరు ఉధృతికి రహదారి కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.
లింగపాలెం మండలం రంగాపురం మీదుగా కళ్లచెరువు గ్రామాన్ని కలిపే తాత్కాలిక మట్టి రోడ్డు గుండేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్న పాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలోని డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి.
శ్రీనివాసపురం సమీపంలో రేల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసింది. భోగాపురం, పూసపాటిరేగ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. విశాఖ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆర్కే బీచ్‌లోని సముద్రతీరం భారీగా కోతకు గురైంది.
ప్రత్యేక బృందాలు రంగ ప్రవేశం
రాష్ట్రంలో భారీ వర్షాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల స్పందన బలగాలు(ఎస్‌డీఆర్‌ఎఫ్) సర్వసన్నద్ధంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులకు వరద ముప్పు పొంచి ఉండటంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ ముందుగానే సన్నద్ధమైంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో నాలుగేసి సహాయక బృందాల చొప్పున మొత్తం 8 బృందాలను నియోగించారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, ఐనవల్లి, ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, కుక్కునూరులలో రెండేసి బృందాల చొప్పున సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో బృందంలో ఒక అసిస్టెంట్ కమాండెంట్, ఒక రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు 40 మంది సభ్యులు ఉన్నారు. స్పీడ్ బోట్లు, జాకెట్లతోపాటు రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించేందుకు అవసరమైన యంత్ర పరికరాలతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
ఇప్పటికే జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులతో కలసి లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా సహాయక శిబిరాలకు తరలి వెళ్లేలా సూచిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే తమను సంప్రదించాలని ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా నది తీరంలో పదేసి మంది సభ్యులతో కూడిన మూడు బృందాలను నియోగించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సన్నద్ధమైంది.
కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలలో 40 మంది సభ్యులతో కూడిన మూడేసి ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల్లోని గజ ఈతగాళ్లతోపాటు మత్స్యకార ప్రాంతాల్లోని ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment