సాక్షి, ప్రకాశం: జిల్లాలో భారీ వర్షాలు ముచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సగిలేరు ఉప్పొంగడంతో గిద్దలూరు పట్టణంలో రోడ్లపైకి భారీగా నీరు ప్రవహిస్తోంది. పొంగిపొర్లుతున్న సగిలేరు,గుండ్లకమ్మ కాలువలు ధాటికి చెరువులు, కుంటలు నిండిపోయాయి. కంభం చెరువుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది.
అర్ధవీడు వద్ద ప్రమాద స్థాయిలో జంపలేరు ప్రవహిస్తోంది. దీంతో అర్ధవీడు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వరద నీటి దెబ్బకు తాటి చెర్ల చెరువుకు గండిపడింది. గిద్దలూరు పట్టణంలో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. నల్లమలంలో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ నది ఉగ్రరూపం దాల్చింది. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. చదలవాడ వద్ద చెరువుకు గండిపడి నీరు జాతీయ రహదారి పై ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న ఎస్టీ కాలనీలోకి నీరు చేరడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు.
చీరాల-ఒంగోలు మధ్య రాకపోకలు స్తంభించాయి. అక్కడే చీరాల నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు వాగులో ఒరిగిపోయింది. ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా కాపాడారు. మరో పక్క పర్చూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి పలుచోట్ల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకొల్లు పర్చూరు మధ్య వాగు పొంగుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పర్చూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మిర్చి నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment