ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు
జలదిగ్బంధంలో హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ భవనాలు
జలదిగ్బంధంలో హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలు
నదుల్ని తలపించిన రహదారులు.. సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు
భారీ వర్షాలకు ఉప్పొంగిన కొండవీటి వాగు, వంకలు
సాక్షి, అమరావతి/తాడేపల్లి/తాడికొండ: భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది. ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయమయ్యాయి. రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. సీడ్ యాకిŠస్‌స్ రోడ్డుపైన వరద నీరు భారీగా ప్రవహించింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీలు సైతం నీటమునిగాయి. రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండటంతో రాజధాని ప్రాంతానికి రెండు రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఉధృత రూపం దాలి్చన కొండవీటి వాగు..
భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఈ వాగు రాజధాని ప్రాంతంలో 31.15 కి.మీల పొడవునా ప్రవహిస్తోంది. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కొండవీటి వాగును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వాగు కట్టలను బలోపేతం చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
కాని ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో కొండవీటి వాగు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తుళ్లూరు మండలంలోని కోటేళ్లవాగు, అయ్యన్నవాగు, నక్కవాగు, పాలవాగుల ద్వారా వచ్చే వరద ఉధృతి కూడా కొండవీటి వాగులో ప్రవహించాల్సిన పరిస్థితి రావడంతో రాజధానికి నీటి గండం తప్పడం లేదు. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు కమిటీలు మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులను భయపెట్టి, బెదిరించి సేకరించారు. ఇలా నిరి్మంచిన రాజధాని నిర్మాణాలు ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
సారపాక వాగు కల్లోలం
కృష్ణా నది వరద నీరు రాజధాని ప్రాంతంలోని సారపాక వాగులోకి ప్రవహిస్తుండడంతో కలకలం రేగింది. వరద నీరు సారపాక వాగు గుండా బయటకుపోయేందుకు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గతంలో పైపులైను వేశారు. ఆదివారం అందులో నుంచి రాజధాని గ్రామాల్లోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయతి్నంచారు. అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్, ఇసుక, బూడిదను తీసుకువచ్చి తూముల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది. స్థానికులు దీన్ని గుర్తించకపోతే వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాలు ముంపునకు గురయ్యేవి.
కొట్టుకుపోయిన కొండవీటి వాగు గేట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు కృష్ణా నదిలో కలిసేచోట ఉన్న గేట్లలో రెండు గేట్లు ఆదివారం రాత్రి కొట్టుకుపోయినట్టు సమాచారం. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటి వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద 17.5 అడుగుల నీటిమట్టం వస్తేనే తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా.. కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.
మరో రెండు అడుగులు పెరిగితే ఉండవల్లిలో కొంత భాగం, పెనుమాకలో పంట పొలాలు, టిడ్కో నివాసాలు మునిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద సిబ్బందితో సమీక్షిస్తున్నారు.కృష్ణా నది నుంచి కొండవీటి వాగులోకి నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయించడంతోపాటు ఎత్తిపోతల పథకం వద్ద నీటి సంపులో పేరుకుపోయిన తూటికాడను తొలగించే పనులు చేపట్టారు.
రైతు కష్టం ‘కృష్ణా’ర్పణం
సాక్షి, అమరావతి: రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణా నదీపరివాహాక ప్రాంతంలో మాగాణి, మెట్ట అనే తేడా లేకుండా వాణిజ్య, ఆహార
పంటలు దెబ్బతిన్నాయి.
2.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట
ఆదివారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం 2.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 50వేలకు పైగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. ఆ తర్వాత 40 వేల ఎకరాల్లో పత్తి, 12వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా 2.30 లక్షల ఎకరాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత గోదావరి డెల్టా పరిధిలో 25వేల ఎకరాలు, ఉత్తరాంధ్రలో 1500 ఎకరాల్లో పంటలు మునిగినట్టు లెక్కతేల్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 15వేల ఎకరాలు, నంద్యాలలో 10వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన పంట పొలాల్లో 60 నుంచి 70 శాతం పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30–40శాతం పంటలు ముంపు నుంచి తేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment