సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉక్కు’ ఉద్యమ సెగ తగిలింది. 150 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి చేరుకోక ముందు నుంచే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్‌ఎఫ్, కేంద్ర బలగాలు కూడా ఎయిర్‌పోర్టు లోపల పహారా కాశాయి. ఎయిర్ పోర్టులోకి వచ్చే వాహనాల్ని తనిఖీ చేసి.. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ బలగాలు వారిని నిరోధించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప పెనుగులాట జరిగింది. నిర్మలా సీతారామన్ గో బ్యాక్, విశాఖ ద్రోహి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ.. విమానాశ్రయ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అప్రమత్తమై వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కొంతమంది ఉద్యమకారులు పోలీస్ వలయాన్ని దాటుకుంటూ.. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉక్కు ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బయటికి రావడంతో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోకుండా భద్రతా బలగాలు ఉద్యమకారులను నిలువరించాయి. సీతారామన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లేంత వరకూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేస్తున్న పోర్టు గెస్ట్ హౌస్ వరకూ ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment