
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల జారీ చేసిన జీవోలు 53, 54లకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు 53, 54లను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, మరికొన్ని విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. గ్రామ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ఇలా పలు స్థాయిల్లో పాఠశాలలను వర్గీకరణ చేసి ఫీజులను ఖరారు చేశారని తెలిపారు. ఇలాంటి వర్గీకరణను చట్ట నిబంధనలు ఆమోదించవన్నారు. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఫీజులను ఖరారు చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది కె.రఘువీర్ స్పందిస్తూ.. పూర్తి వివరాలు సమర్పిస్తామని, కొంత గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.