సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో, తిరిగి అదే తేదీల్లో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమయం తక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపింది. భక్తులు ఎక్కువగా వచ్చే కార్తీక మాసంలో మహా కుంభాభిషేకం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంలో కొన్ని అంశాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. మహా కుంభాభిషేకాన్ని కొనసాగించేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎవరిని సంప్రదించి వాయిదా వేశారు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను, దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలు జరిపేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ పండితులను సంప్రదించకుండానే మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పూజాదికాల్లో జోక్యం చేసుకునే అధికారం కమిషనర్‌కు లేదన్నారు. దేవదాయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేశామన్నారు.
విజయవాడలో నిర్వహించిన యజ్ఞానికి ఎండ తీవ్రత కారణంగా భక్తులు అనుకున్న స్థాయిలో రాలేదని, ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే దేవస్థానం అధికారులతో మాట్లాడి, కంచి పీఠాధిపతి అనుమతి తీసుకున్న తరువాతే కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహా కుంభాభిషేకానికి ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే జరిగాయని దేవస్థానం తరఫు న్యాయవాది రమణరావు కోర్టుకు నివేదించారు. వాయిదా వల్ల ఆ ర్థిక నష్టం ఏమీ జరగదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేశామే తప్ప, రద్దు చేయలేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కొన్ని ఆదేశాలిస్తామంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment