Maha kumbhabhishekam
-
అదే తేదీల్లో మహా కుంభాభిషేకానికి ఆదేశాలివ్వలేం
సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో, తిరిగి అదే తేదీల్లో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమయం తక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపింది. భక్తులు ఎక్కువగా వచ్చే కార్తీక మాసంలో మహా కుంభాభిషేకం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంలో కొన్ని అంశాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. మహా కుంభాభిషేకాన్ని కొనసాగించేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎవరిని సంప్రదించి వాయిదా వేశారు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను, దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలు జరిపేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ పండితులను సంప్రదించకుండానే మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పూజాదికాల్లో జోక్యం చేసుకునే అధికారం కమిషనర్‌కు లేదన్నారు. దేవదాయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేశామన్నారు. విజయవాడలో నిర్వహించిన యజ్ఞానికి ఎండ తీవ్రత కారణంగా భక్తులు అనుకున్న స్థాయిలో రాలేదని, ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే దేవస్థానం అధికారులతో మాట్లాడి, కంచి పీఠాధిపతి అనుమతి తీసుకున్న తరువాతే కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహా కుంభాభిషేకానికి ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే జరిగాయని దేవస్థానం తరఫు న్యాయవాది రమణరావు కోర్టుకు నివేదించారు. వాయిదా వల్ల ఆ ర్థిక నష్టం ఏమీ జరగదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేశామే తప్ప, రద్దు చేయలేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కొన్ని ఆదేశాలిస్తామంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
గంగమ్మకు కుంభాభిషేకం.. మహాద్భుతం!
సాక్షి, తిరుపతి: ‘గంగా పుష్కర కాలంలో గంగమ్మ తల్లికే మహాకుంభాభిషేకం నిర్వహించడం మహాద్భుతం. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకం’ అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో చివరి రోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యాగ యజ్ఞపూజలు నిర్వహించారు. యాగశాల నుంచి గంగమ్మ తల్లి మూలవిరాట్‌ను తీసుకువచ్చి నూతనంగా నిర్మించిన గర్భాలయంలో విజయేంద్ర సరస్వతి..అమ్మవారిని ప్రతిష్టించి అభిషేకం నిర్వహించారు. గర్భాలయం విమాన గోపుర శిఖరంపై శాస్త్రోక్తంగా బంగారు తాపడంతో తయారు చేసిన కలశాన్ని స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. నదులను కాలుష్యం చేయకుండా కాపాడాలని కోరారు. కుంభాభిషేకంతో సకల జనులకు సంతోషం కలుగుతుందని 18వ శతాబ్దంలో శాసనంలో పొందుపరచారని, ఈ శాసనం కంచి ఆలయంలో ఉందని చెప్పారు. హిందూధర్మం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు: స్వరూపానందేంద్ర గంగమ్మ తల్లి తొలి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేస్తూ..దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదని, అన్ని కులాల వాడని అన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా భూమ న చేపట్టిన దళిత గోవిందం కా ర్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. మంత్రి రోజా మా ట్లాడుతూ..రాజుల కాలం మాదిరిగా సీఎం జగన్ పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలతో రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తున్నా రని చెప్పారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో పీఠాధిపతులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూ టీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నయనానందం.. నృసింహుని కల్యాణం) -
వైభవం..వరసిద్ధుని మహాకుంభాభిషేకం
సాక్షి చిత్తూరు: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని విరాళదాతలు ఇచ్చిన రూ.10 కోట్లతో శిల్పకళా సౌందర్యంతో పునర్నిర్మించారు. ఇందులో భాగంగా ఆదివారం మహా కుంభాభిషేకం క్రతువును ఆగమ పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు చతుర్థకాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. 8 గంటలకు రాజగోపురం, పశ్చిమ ద్వార గోపురం, విమాన గోపురం, నూతన ధ్వజస్తంభానికి, 8.30 గంటలకు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను స్వయంభు దర్శనానికి అనుమతించారు. సుమారు 5 నెలల తరువాత స్వయంభు దర్శనం తిరిగి ప్రారంభించడంతో భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పుష్పాలు, విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. తొలిరోజే సుమారు 20–30 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుంభాభిషేకం క్రతువు సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేలూరు శ్రీపురం స్వర్ణదేవాలయం వ్యవస్థాపకులు శక్తినారాయణి అమ్మవారు ఆవిష్కరించారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీ మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎంఎస్‌బాబు, ఆరణి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్‌బాబు, విరాళ దాత కుటుంబ సభ్యులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
బృహదీశ్వరాలయ కుంభాభిషేకానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తంజావూరు బృహదీశ్వరాలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. దీన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 23 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం నిర్వహించడంతో.. దీన్ని తిలకించడానికి దేశవిదేశాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో తంజావూరు ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. బృహదీశ్వరాలయ ప్రధాన రాజగోపురంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పలు దేవతామూర్తుల ఆలయ శిఖరాలపైనా శివాచార్యులు, శైవాగమ పండితులు, ఓదువార్లు పవిత్ర నదీజలాలతో గోపురాలపైనున్న స్వర్ణ, రజిత, కాంస్య కలశాలకు సంప్రోక్షణ చేశారు. ఇందుకోసం యోగశాలలో ఉంచిన గంగా, యమున, కావేరి నదుల పవిత్రజలాలతో నిండిన 705 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం మహాకుంభాభిషేకంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు తిరుమల తరహాలో దర్శన సదుపాయం కల్పించారు. రద్దీ విపరీతంగా ఉండటంతో తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా పోలీసులు, ఆలయ నిర్వాహకులు నంది మంటపం వద్ద కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులు మైమరచి, భక్తిపారవశ్యంతో ‘పెరువుడయారే వాళ్గ’, హర హర శంకరా! పెరువుడయారే (బృహదీశ్వరా) అంటూ జయజయ ధ్వానాలు చేశారు. కాగా.. బృహదీశ్వరాలయ గోపురంపైనున్న స్వర్ణకలశంపై శివాచార్యులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో ఓ గరుడ పక్షి (గద్ద) ఆకాశంలో ప్రదక్షిణ చేసి వేగంగా మాయమైంది. ఆ దృశ్యాన్ని చూసి శివాచార్యులు, భక్తులు పులకించిపోయారు. -
దైవసన్నిధానంలో మహాకుంభాభిషేకం ప్రారంభం
ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ కుంభాభిషేకం జరుగుతోంది. శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ అభిషేకం ఉంటుంది. ఈ ఐదు రోజులూ స్వరూపానందేంద్ర సరస్వతి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని దైవసన్నిధానం వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దైవసన్నిధానం చైర్మన్, నటుడు మురళీమోహన్, హీరో చిరంజీవి భార్య సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విశాఖలో పర్యటించనున్న వైఎస్ జగన్
శారదాపీఠం సందర్శన పీఠం వార్షికోత్సవాలకు హాజరు విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్నం వస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ తెలిపారు. ఈ పర్యటన వివరాలను బుధవారం సాయంత్రం ఆయన మీడియాకు వివరించారు. గురువారం ఉదయం 7.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీ కృష్ణయాదవ్ నివాసానికి వెళతారు. 10 గంటలకు పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 11.45 గంటలకు పెందుర్తిలోని పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్‌కుమార్ జంటను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 12.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. గత ఏడాది జనవరి 27న కూడా శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొన్నారు. ఈ సారి ముగింపు ఉత్సవాలకు హాజరవుతున్నారు. -
'ఈ ఏడాది వర్షాలు తక్కువ... ఎండలు ఎక్కువ'
విశాఖపట్నం: సెక్యూలర్ పేరుతో హిందూ శాస్త్రాలు మోసానికి గురవుతున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ 14 నుంచి 18 వరకు పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని.. ఎండలు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు. భూకంపాలు, అగ్రి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉందన్నారు. దేవాలయాల సనాతన సాంప్రదాయాన్ని, శాస్త్రాలను అమలు పరచడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా 17న వేద పండితులకు సత్కారం, సువర్ణ కంకర ధారణ కార్యక్రమం నిర్వహిస్తామని స్వరూపానందేంద్ర వెల్లడించారు.