వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై స్పందించిన హైకోర్టు
సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్‌కు నోటీసులు
వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కూల్చివేతలకు బాధ్యులైన సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్సార్‌సీపీ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్టప్రకారం నడుచుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లను ఆదేశిస్తూ గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాలను వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. దీంతో సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్‌కుమార్‌లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది నన్నపనేని శ్రీహరి అధికారుల వ్యవహారశైలిని.. కోర్టు ధిక్కారాన్ని న్యాయమూర్తికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులుగా ఉన్న అధికారులిద్దరికీ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment