
బుధవారం రాజ్‌భవన్‌లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో మాట్లాడుతున్న గవర్నర్ విశ్వభూషణ్
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనే నియమ నిబంధనలు, గతంలోనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలపై మొండిగా వ్యవహరిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లకు సిద్ధం కావడం.. రద్దు చేసుకున్న సమావేశాలను మరుసటి నిర్వహిస్తానంటూ మళ్లీ వెంటనే పేర్కొనడం.. ఇలా ఎవరో ప్రేరేపించినట్లుగా ఆయన లేఖలు రాస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
రద్దు చేసి మళ్లీ అంతలోనే...
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించాలని భావించిన వీడియో కాన్ఫరెన్స్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైడ్రామా మధ్య చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మొండిగా ముందుకెళ్లాలనే యోచనలో ఉన్న ఆయన దీన్ని నేడు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వివరాల ప్రకారం.. రద్దు చేసుకున్న ఆ సమావేశాన్ని తిరిగి గురువారం నిర్వహిస్తానంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఉదయం 10 – 12 గంటల మధ్య దీన్ని నిర్వహించ తలచినట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో సీఎస్‌కు సూచించారు.
చాంబర్‌కే పరిమితం..
ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ఆయా అధికారులందరికీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారమే లేఖలు రాశారు. అయితే ఒకదాని వెంట ఒకటిగా రోజంతా చోటు చేసుకున్న పరిణామాల తరువాత నిర్ణీత సమయానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకుండా నిమ్మగడ్డ తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ సమావేశాన్ని నిర్వహించకుండా విరమించుకున్నట్లు అనంతరం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ సాయంత్రం 3 గంటల వరకు కార్యాలయంలోనే అందుబాటులో ఉండి తర్వాత వెళ్లిపోయారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులకు తోడు సెకండ్ వేవ్ రూపంలో మరోసారి వైరస్ ప్రబలుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంపై ప్రభుత్వపరంగా అభ్యంతరాలు తెలియజేస్తూ సీఎస్ సాహ్ని మంగళవారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యుత్తరం రాశారు.
గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. అరగంట ముందే రాజ్‌భవన్ చేరుకున్న ఆయన 20 నిమిషాల పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్‌కు లేఖ సమర్పించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు ప్రత్యుత్తరం ఇవ్వడంపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలా వ్యవహరించడం చట్ట విరుద్ధమంటూ అంతకుముందు ఆయన సీఎస్‌కు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment