సాక్షి, హిందూపురం: పట్టణంలోని జీఆర్ లాడ్జీలో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్ అక్షిత కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే హంతకుడిగా తేల్చారు. దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏటూరి నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్ వర్మ 6 నెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్ అక్షిత పరిచయమైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్న మహేశ్ వర్మ ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్‌బళ్లాపురం వెళ్లగా.. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు.
అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసులు
చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్)
తనకు పెళ్లయి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేష్ వర్మ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు. ఫొటోలు డిలీట్ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు.
అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్‌వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment