సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12 ఫైర్ స్టేషన్‌లు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం నగరంలో హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాలను, సిబ్బంది పనితీరును హోంమంత్రి పరిశీలించారు. నూతన ఫైర్ వెహికల్‌ను సుచరిత జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్‌లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ఆమె సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, కంబాల జోగులు, కళావతి, గొర్లే కిరణ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత
మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల జిల్లాలో 200లకు పైగా అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. అగ్ని ప్రమాదాల వలన దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిప్రమాదాల బారి నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆస్తిని కాపాడటం జరిగిందని, వివిధ అగ్నిప్రమాదాల నుంచి 15 మందిని ప్రాణాలతో కాపాడినట్లు తెలిపారు. ఎక్కడ విపత్తులు జరిగినా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారని, కచులూరు బోట్ ప్రమాదం, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాల్లో ఫైర్ సిబ్బంది ఎన్నో సేవలందించారని ప్రశంసించారు. ప్రమాదాల నుంచి మనుషులతో పాటు పశువులను కూడా ప్రాణాలతో కాపాడిన ఘటనలు ఉన్నాయని, ప్రాణాలకు తెగించి విపత్తు సేవలందిస్తున్న ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో 84 స్కోచ్ అవార్డులలో మన రాష్ట్ర పోలీస్ శాఖ 48 అవార్డులు దక్కించుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని ప్రస్తావించారు. చదవండి: రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే హత్య!
అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయి
‘పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లు టెక్నాలజీ సహాయంతో ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా ఫైర్ డిపార్టమెంట్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే పూరి గుడిసెల్లో ఫైర్ ఆక్సిడెంట్‌లు విపరీతంగా జరిగేవి. ఇప్పుడు అలాంటి అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. దీనికంతా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఫలితమే అని చెప్పాలి. వైఎస్సార్ పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వడం వలన అగ్నిప్రమాదాలు చాలా తగ్గాయి. భవిష్యత్తులో ఫైర్ డిపార్ట్‌మెంట్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అడిషనల్ డీజీ మహమ్మద్ అసన్ రేజా, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృప వరం, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు పాలవలస విక్రాంత్, పిరియా సాయిరాజ్ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment