కేసులు నమోదు చేయని అత్యాచారాలే ఎక్కువ
హోమ్ మంత్రి వంగలపూడి అనిత
మంత్రి వ్యాఖ్యలపట్ల బాధితుల మండిపాటు
సాక్షి, అమరావతి: ‘మీకు తెలుసు కదా పెద్ద పెద్ద కుటుంబాలు, పరువుగల కుటుంబాల్లో అత్యాచారాలు జరిగినా కేసులు పెట్టడం లేదు. కేసులు నమోదుకాని అత్యాచారాలు ఎక్కువే జరుగుతున్నాయి’అని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించి కచ్చితంగా శిక్షిస్తామన్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. వారిలో మైనర్లు ఉన్నారని చెప్పారు. అత్యాచార కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాయనుందని మంత్రి అనిత చెప్పారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసు శాఖతో అనుసంధానిస్తే నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు.
ఇవేం వ్యాఖ్యలు మంత్రిగారూ..
అత్యాచారాలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బాధితులను విస్మయానికి గురి చేశాయి. ‘అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న అత్యాచార బాధితులంతా పరువులేని కుటుంబాలకు చెందినవారా’అని పరిశీలకులు మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అత్యాచార బాధితులపై సానుభూతి చూపాల్సిన మంత్రి అనిత అందుకు విరుద్ధంగా వారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం విభ్రాంతికి గురిచేస్తోందని విమర్శిస్తున్నారు.
అత్యాచారం వంటి దురదృష్టకర ఘటనలు జరిగితే బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయండి... వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోమ్ మంత్రిగా, అందులోనూ మహిళగా ఆమె కోరాలి. అందుకు విరుద్ధంగా అత్యాచారాలపై ఫిర్యాదులు చేసేవారు పరువుగల కుటుంబాలకు చెందినవారు కాదనే అర్థం వచ్చేలా మాట్లాడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment