గృహోపకరణాలకు పెద్దపీట | Home theaters and big screen TVs are in high demand with Covid | Sakshi
Sakshi News home page

గృహోపకరణాలకు పెద్దపీట

Published Sun, Nov 8 2020 3:01 AM | Last Updated on Sun, Nov 8 2020 3:12 AM

Home theaters and big screen TVs are in high demand with Covid - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ దెబ్బతో కొనుగోళ్ల విషయంలో ప్రజల ఆలోచనా విధానం సమూలంగా మారిపోయింది. గృహోపకరణాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రధానంగా సినిమా హాళ్లు మూత పడటంతో వినోదం కోసం ప్రజలు ఇంటినే ఒక సినిమా హాలుగా మార్చుకుంటున్నారు. డబ్బున్న వారు హోమ్‌ థియేటర్‌ సమకూర్చుకుంటుంటే.. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు పెద్ద స్క్రీన్లు ఉన్న టీవీలను కొని తెచ్చుకుంటున్నారు. కోవిడ్‌ వల్ల పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ విధానంలో రిలీజ్‌ చేస్తుండటంతో వాటిని ఇంటి వద్ద నుంచే చూడటానికి అనువుగా పెద్ద స్క్రీన్ల టీవీలపై మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎల్‌ఈడీ టీవీ అమ్మకాల్లో 32 అంగుళాలవి ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు 43 అంగుళాలు, అంత కంటే ఎక్కువ సైజు ఉన్న టీవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని విజయ్‌ సేల్స్‌ (పాత టీఎంసీ) ప్రతినిధి అశోక్‌ కుమార్‌ తెలిపారు. గతంతో పోలిస్తే హోమ్‌ థియేటర్ల అమ్మకాలు 50 శాతం పెరగ్గా, పెద్ద ఎల్‌ఈడీ టీవీల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెరగడంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశంలో రికార్డు స్థాయిలో 5.43 కోట్ల మొబైల్‌ ఫోన్లు దిగుమతి అయ్యాయంటే డిమాండ్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్‌ దెబ్బతో రాష్ట్రంలో అనేక రంగాల్లో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణిస్తే, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల తయారీలో మాత్రం భారీ వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌–ఆగస్టు మధ్య కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి 71.18 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పని మనిషికి బైబై..
► కరోనా మహమ్మారి భయంతో చాలా మంది పని మనుషులకు టాటా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా డిష్‌ వాషర్లకు డిమాండ్‌ పెరిగింది. గతంలో నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి రెండు డిష్‌ వాషర్లు అమ్మడం గగనంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు నెలకు 600 వరకు అమ్ముతున్నట్లు సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి.భాస్కర మూర్తి తెలిపారు. 
► ఒక్కసారిగా డిష్‌ వాషర్లకు డిమాండ్‌ పెరగడంతో దానికి తగ్గట్టుగా సరఫరా ఉండటం లేదని, దీంతో బుకింగ్‌ చేసుకున్న 15 రోజులకు గానీ సరఫరా చేయలేకపోతున్నామని విజయ్‌ సేల్స్‌ ప్రతినిధి అశోక్‌ తెలిపారు. 
► వాషింగ్‌ మెషీన్లకూ డిమాండ్‌ పెరిగినా, ఇప్పుడు గతేడాది స్థాయిలోనే అమ్మకాలు జరుగుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో దసరా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం వరకు వృద్ధి నమోదైంది. దీంతో దీపావళి పండగ అమ్మకాలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, స్క్రాచ్‌ కార్డులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement