సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/చింతూరు/ధవళేశ్వరం: రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని వంటి ఉపనదుల నుంచి భారీగా వస్తున్న నీటితో గోదావరిలో గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది.
తెలంగాణలోని కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5,11,080 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి 7,54,470 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్ నుంచి 10,49,351 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 9.28 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరగటంతో పట్టిసం శివక్షేత్రం చుట్టూ వరద నీరు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి బుధవారం రాత్రి 8 గంటలకు 8,37,850 క్యూసెక్కులు చేరుతుండగా.. నాలుగువేల క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,33,850 క్యూసెక్కులను 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ నీటిమట్టం 10.70 అడుగులకు చేరింది.
ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్‌రూమ్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 లేదా 11 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వస్తున్న ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. మరో రెండ్రోజులు బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో గోదావరి వరద మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
విలీన మండలాల్లో నిలిచిన రాకపోకలు..
గోదావరి వరదతో విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాకల్లో పలు గ్రామాలు జలదిగ్బంధ మయ్యాయి. భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరినది పొంగి రహదారులపైకి వరద నీరు చేరడంతో చింతూరు మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
2వ తేదీ నాటికి మరో అల్పపీడనం
అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్‌డీపీఎస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment