కర్నూలు (సెంట్రల్): మానవ హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని, తప్పుచేస్తే శిక్ష తప్పదని ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి స్పష్టంచేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే ఎంతటి వారైనా అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సామాన్యుడి హక్కులను హరిస్తే వారి తరఫున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగుతుందని చెప్పారు. ఎక్కువగా పోలీసుస్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వివరించారు. కర్నూలులో కమిషన్ కార్యాలయం ప్రారంభమై నెలరోజులవుతోందని, ఇప్పుడిప్పుడే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయని ఆయన చెప్పారు. కమిషన్ సేవలను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే వెబ్‌సైట్, ఈ–మెయిల్, వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జస్టిస్ సీతారామమూర్తి చెప్పారు. కమిషన్ సేవలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఆరు నెలల్లో 135 సమస్యలు.. 72 కేసులు
2021 మార్చి 23 నుంచి ఇప్పటివరకు మొత్తం 135 సమస్యలు వచ్చాయి. అందులో 72 అర్జీలపై హెచ్‌ఆర్‌సీ కేసులు నమోదు చేశాం. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల వారు నేరుగా ఫిర్యాదులు అందిస్తున్నారు. భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్లు, వీఆర్వోలపైనే ఎక్కువగా ఫిర్యాదులు ఉంటున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపై కూడా కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులను పోస్టు, కొరియర్, ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా ఏపీ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, 1, 2, 4 గదులు, ధర్మపేట, కర్నూలు–518004 చిరునామాకు పంపొచ్చు.
ఫిర్యాదును పోలీసులు నమోదు చేయాల్సిందే
ఎలాంటి సందర్భంలోనైనా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే సెక్షన్–173 ప్రకారం కేసు నమోదు చేయాలి. చేయకపోతే పోలీసులే బాధ్యులవుతారు. తరువాత సెక్షన్–153 ప్రకారం ఆ కేసులో మెరిట్స్ లేకపోతే అదే విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలపాలి. అంతేకానీ.. కేసు నమోదు చేయకుండా ఉండకూడదు. అలా చేస్తే మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. అలాగే, కమిషన్ రూపొందించుకున్న 14 అంశాలు ఫిర్యాదులో కచ్చితంగా ఉండాలి. లేదంటే ఆ ఫిర్యాదు డిస్‌మిస్ అవుతుంది. అవి..
► ఫిర్యాదులో వాది, ప్రతివాది అడ్రస్సులు పిన్‌కోడ్‌తో సహా ఉండాలి. వీలైతే ఫోన్ నంబర్లనూ రాయాలి.
► ఫిర్యాదుదారుడు కచ్చితంగా అర్జీలో సంతకం చేయాలి.
► ఏడాదిలోపే ఆ అంశంపై ఫిర్యాదు చేయాలి. అదే సమయంలో ఆ ఫిర్యాదు అంశంపై ఏ కోర్టుల్లో కేసులు ఉండడం కానీ, నడుస్తుండడం కానీ జరగరాదు.
► ఏ రాష్ట్రానికి సంబంధించి ఫిర్యాదు అదే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి.
► ఏదైనా సంఘటనను ప్రోత్సహించిన అధికారి, అమలుచేసిన అధికారులు ఉంటే వారి పేర్లను నేరుగా చేరిస్తే వారిని విచారణకు పిలవడానికి వీలుంటుంది.
► ఆఫీసర్‌పై వ్యక్తిగత ఫిర్యాదు చేస్తే వారి ఇంటి అడ్రస్సు.. వృత్తిపరంగా చేస్తే హోదా, కార్యాలయం, ఇతర వివరాలు ఇవ్వాలి.
► ఫిర్యాదు కాపీలు నాలుగు ఉండాలి. ఒకే సమస్యపై ఐదారుగురు ఫిర్యాదు చేయదలుచుకుంటే మొదటి వ్యక్తి పేరుతో ఫిర్యాదు చేయాలి.
హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తాం
Published Fri, Oct 1 2021 4:54 AM | Last Updated on Fri, Oct 1 2021 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment