జయహో బీసీ.. ఛలో విజయవాడ | Huge arrangements YSRCP Jayaho BC Maha Sabha | Sakshi
Sakshi News home page

జయహో బీసీ.. ఛలో విజయవాడ

Published Wed, Dec 7 2022 5:01 AM | Last Updated on Wed, Dec 7 2022 9:33 AM

Huge arrangements YSRCP Jayaho BC Maha Sabha - Sakshi

విజయవాడ వారధిపై రెపరెపలాడుతున్న వైఎస్సార్‌సీపీ జెండాలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం సిద్ధమైంది. ‘వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాస­భకు భారీఏర్పాట్లు చేశారు. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వస్తున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో మహాసభకు వచ్చేవారికి స్వాగతం పలు­కుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీసీ మహాసభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మంగళవారమే బీసీల ర్యాలీలు బయలుదేరాయి.

అనంతపురం జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో బీసీ ప్రతినిధుల వాహనాలు విజయవాడకు పయనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82,432 మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతినిధులకు మహాసభకు ఆహ్వానం పంపించారు. వెనుకబడిన తరగతు­లకు చెందిన పంచాయతీ వార్డు మెంబర్, మున్సి­పల్‌ వార్డు కౌన్సిలర్‌ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారికి సైతం జయహో బీసీ మహాసభ ఆహ్వానాలు అందాయి.

పార్టీ మినీప్లీనరీ తరహా­లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు వస్తున్న ఆహ్వానితుల సంఖ్యకు అనుగు­ణంగా సభ ప్రాంగణంతోపాటు అల్పాహారం, భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను రెండువేల బస్సులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో రెండువేల భారీవాహనాల్లో బీసీ ప్రతినిధులు తరలి­రానున్నారు. వాటితోపాటు సమీప ప్రాంతాల నుంచి సొంత కార్లు, బైక్‌లపైన కూడా పెద్దసంఖ్యలో విజయవాడకు వస్తున్నారు.

దూరప్రాంతాల నుంచి వచ్చే బీసీ ప్రతినిధులకు విజయ­వాడ, గుంటూరు నగరాల్లో నాలుగువేలకుపైగా హోటల్‌ గదులు, 150 కమ్యూనిటీ హాళ్లు, కల్యాణమండపాల్లో వసతి ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. బందరు రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు బీసీ సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. విజయవాడ నగరం మీదుగా దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను నగర శివారు ప్రాంతాల నుంచే మళ్లిస్తున్నారు. 

విజయవాడ నుంచి విజయదుందుభి
రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలను ఒకే వేదిక­పైకి తీసుకొచ్చి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం గడిచిన మూడున్నరేళ్లలోనే బీసీలకు అందించిన లబ్ధిని జయహో బీసీ మహాసభలో వివరించనున్నారు. రానున్న కాలంలో బీసీలకు మరింత మేలుచేసేలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వను­న్నారు.

క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. విజ­యవాడ సభను విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో సభలు నిర్వహించి విజయదుందుభి మోగించేందుకు నాంది పలకనున్నారు.

అల్పాహారంలో 9.. భోజనంలో 21 రకాల పదార్థాలు
జయహో బీసీ మహాసభకు సభా ప్రాంగణం, ఆహారం, నీరు, వసతి వంటి ఏర్పాట్ల బాధ్య­తల్ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మె­ల్సీలు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరు నాలుగు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తు­న్నారు. సభకు వచ్చేవారికి 9 రకాల పదార్థాలతో అల్పాహారం, 21 రకాల పదార్థాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి పదివేల మంది భోజనం చేసేలా రెండు ప్రదేశాల్లో భోజనశాలలు ఏర్పాటుచేశారు.

అల్పాహారంలో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్, రవ్వకేసరి ఉన్నాయి. కాఫీ, టీ ఏర్పాటు చేశారు. మాంసాహారంలో మటన్‌ బిర్యానీ, చికెన్‌ ఫ్రై, చికెన్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రై, రొయ్యలు కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, అన్నం, పెరుగు, చక్కెర పొంగలి, శాఖాహారంలో వెజ్‌ బిర్యాని (పనసకాయ ధమ్‌), పన్నీర్‌ గ్రీన్‌పీస్‌ కర్రీ, డబుల్‌ బీన్స్‌ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమాటాపప్పు, గోంగూర పచ్చడి, అన్నం, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలి వడ్డిస్తారు. 

12 గంటలకు సీఎం ప్రసంగం
జయహో బీసీ.. మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వేదికపై బీసీ నాయకులు మాట్లాడతారు. 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడుకు చేరుకుంటారు. 3.55 గంటల నుంచి 4.10 వరకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement