సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకి డిమాండ్ కొనసాగుతోంది. టీటీడీ ఆన్‌లైన్‌లో శుక్రవారం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కి 14 లక్షల హిట్లు వచ్చాయి. అయినా టికెట్ల కేటాయింపు ప్రక్రియ సాఫీగా సాగింది. 55 నిముషాల వ్యవధిలోనే 4 లక్షల 60 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.
కాగా, జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేలు చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది. కాగా, జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు.
చదవండి: (కబడ్డీ కబడ్డీ.. అంటూ బరిలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం)
వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
తిరుమల : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టీటీడీ ఇదివరకే తెలియజేసింది. కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్లు లేకుండా దర్శనానికి వస్తుండటంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అలాంటి వారిని వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని టీటీడీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment