
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల వరద పారుతోంది. దేశంలో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్‌కే మరోసారి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక సత్ఫలితాలనిచ్చింది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన పలు దఫాలుగా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. 2022–23 వార్షిక ప్రణాళిక కింద కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రాష్ట్రానికి రూ. 12 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు కొత్తగా జాతీయ రహదారుల అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ శాఖ సమాయత్తమవుతోంది.
చరిత్రలో అత్యధికంగా...
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రాష్ట్రానికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా ఏడాదికి రూ. 2,400 కోట్లే మంజూరు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో రూ. 2,700 కోట్లు కేటాయించిన కేంద్రం ఏటా పెంచుకుంటూపోతోంది. 2020–21 వార్షిక ప్రణాళిక కింద రాష్ట్రానికి అత్యధికంగా రూ. 7,869 కోట్లు కేటాయించిన విషయం విదితమే.
ఆ నిధులతో రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికను ఆమోదించింది. కాగా ఆ రికార్డును అధిగమిస్తూ 2022–23 వార్షిక ప్రణాళిక కింద నిధుల మంజూరుకు సమ్మతించింది. ఈమేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఇటీవల సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆ నిధులతో అభివృద్ధి చేసే రహదారుల ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. 2022–23 వార్షిక ప్రణాళిక నిధులతో రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించి కేంద్రానికి పంపుతామని ఆర్‌అండ్‌బీ శాఖ చీఫ్ ఇంజినీర్ (జాతీయ రహదారుల విభాగం) వి.రామచంద్ర ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment