పోలవరం స్పిల్ వే వద్ద వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/రాజమహేంద్రవరం/ధవళేశ్వరం/చింతూరు/సాక్షి, అమలాపురం/అయినవిల్లి: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోని.. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) నుంచి రాష్ట్రంలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వందేళ్ల చరిత్రలో జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం ఇదే ప్రథమం. బేసిన్‌లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురువడంతో గోదావరితోపాటు కడెంవాగు, ప్రాణహిత తదితర ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది.
గోదావరి వరద ఉధృతికి పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను తెలంగాణ అధికారులు పూర్తిగా ఎత్తేశారు. దాంతో తుపాకులగూడెం లోకి 9.31 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. అంతేస్థాయిలో వరదను తుపాకులగూడెం నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీకి దిగువన బేసిన్‌లో కురిసిన వర్షాలకు వరద తోడవడంతో సీతమ్మసాగర్‌లోకి 13,42,030 క్యూసెక్కులు చేరుతోంది. సీతమ్మసాగర్ గేట్లు ఎత్తేసి.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ఉప నదుల వరద తోవడంతో మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్కులు ప్రవహిస్తోంది.
ఏలూరు జిల్లా రేపాకగొమ్ము గ్రామస్తులను బోట్‌పై తరలిస్తున్న దృశ్యం
పోలవరం ప్రాజెక్టులోకి 12.5 లక్షల క్యూసెక్కులు
పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద కొనసాగుతోంది. వరద పరిస్థితిపై సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తిలు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 9 గంటలకు 12.5 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్ వే వద్ద వరద నీటి మట్టం 34.2 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 12.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే దిగువన దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 25.4 మీటర్లకు చేరుకుంది.
ఎగువ నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 9 గంటలకు 14.66 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 14.75 అడుగులకు చేరుకుంది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. డెల్టాకు నీటిని విడుదల చేసి మిగులుగా ఉన్న 14.65 లక్షల క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.11 మీటర్లు ఉంది. మరోవైపు.. వరద తీవ్రత పెరగడంతో పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 24 గ్రామాల్లో 7 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. 9 గ్రామాల్లో 2,900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో వరద పెరుగుతూనే ఉంది. కూనవరం, వీఆర్‌పురం మండలాల నడుమ శబరి నదిపై ఉన్న వంతెన పైకి వరదచేరడంతో రాకపోకలు నిలిపివేశారు.
ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద (ఏరియల్ వ్యూ)
కోనసీమ లంకల్లో కలవరం
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతి పెరుగుతుండటంతో జిల్లాలో 18 మండలాల పరిధిలో 51 గ్రామాలపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా. 13 మండలాల పరిధిలోని 43 గ్రామాల చుట్టూ మంగళవారం రాత్రికి వరద నీరుచేరింది. ఈ జిల్లాలో పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు మండలాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పి.గన్నవరం మండలంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఉడుమూడిలంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాల్లేవు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనకాయలంక జలదిగ్బంధంలో చిక్కుకుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, పశువులను లంక గ్రామాల నుంచి ఏటిగట్ల మీదకు తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. లంకవాసుల రక్షణకు 400 బోట్లు, 925 మంది గజఈతగాళ్లను సిద్ధంచేశారు. అయినవిల్లి మండలంలోని పొట్టిలంకకి చెందిన పదిహేను మంది రైతులు పెద్ద ముప్పు తప్పింది. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో వీరు పడవలపై పశువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా పడవ ఇంజిన్ పేలింది. దీంతో పడవలో ఏడు కిలోమీటర్లు మేర ముమ్మిడివరం మండలంలోని శేరులంక వరకు వెళ్లి అక్కడ నుంచి గమ్యానికి చేరుకుని ఊపిరిపీల్చుకున్నారు.
మరో 3 రోజులు వరద ఉధృతి
గోదావరి పరివాహక ప్రాంతంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. ఎగువ నుంచి భారీ వరద వస్తుందంటూ బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సీడబ్ల్యూసీ అప్రమత్తం చేసింది. గరిష్టంగా 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment