తిరుపతి క్రైం: ఆమె జీవితమంతా కష్టాలూ.. కన్నీళ్లే అలముకున్నాయి. అందరూ ఉన్నా కొన్నాళ్లు అనాథగా మారింది. సరైనా ఆలనా, పాలనా లేకపోయినా కష్టపడి చదువుకుంది. చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదురైనా తట్టుకుని నిలబడింది. ఉద్యోగమొచ్చాక ప్రేమ పేరుతో మోసపోయింది. ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా మునిపంటి కింద అదిమిపెట్టి జీవితాన్ని సాగిస్తుంటే.. చివరకు కట్టుకున్నవాడే కాలయముడై ఆమె జీవితాన్ని అంతమొందించాడు.
తిరుపతిలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భువనేశ్వరి దీనగాథ ఇది. భువనేశ్వరిని ఆమె భర్త మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఉదంతం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అడుగడుగునా ఆమె ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి.
భువనేశ్వరి నేపథ్యమిదీ..
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సరోజమ్మ, మునివెంకటప్ప దంపతుల ఐదో కుమార్తె భువనేశ్వరి. ఆ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా.. వారిలో ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలే. కూలి పనులు చేసే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భువనేశ్వరి చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉంటూ చదువులో బాగా రాణించింది. ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే భువనేశ్వరి జీవితానికి సరిపడా సమస్య ఎదుర్కొంది. అప్పట్లో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు.
ఎక్కడకు తీసుకెళ్లాడో తెలియదు. దాదాపు రెండేళ్లపాటు ఆమెను లైంగికంగా వేధించి.. చివరకు గ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆ దుర్మార్గాన్ని తల్లిదండ్రులు గానీ, గ్రామస్తులు గానీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మౌనంగానే భరించిన భువనేశ్వరి చదువుపైనే దృష్టిపెట్టి మంచి మార్కులతో టెన్త్ పాసైంది. ఆ తరువాత పై చదువులు కూడా చదివింది. ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భువనేశ్వరి జీవితంలో మరో సమస్య మొదలైంది. ఈ సారి ప్రేమ పేరుతో ఆమె జీవితంలో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన క్రూరత్వాన్ని బయటపెట్టి ఆమె నుంచి డబ్బు గుంజుకునే పని మొదలు పెట్టాడు. దీంతో భువనేశ్వరి అతన్ని దూరం పెట్టింది.
ఉద్యమం ముసుగులోనూ వంచనే
ప్రేమ పేరిట మోసపోయిన భువనేశ్వరి మగవాళ్లంతా ఇంతేనా? అని తనను తాను ప్రశ్నించుకుంది. తనను మోసం చేసిన వ్యక్తి గురించి లోకానికి చాటుతూ.. తనలాంటి వారికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని నడిపింది. ఆ సమయంలో ఎంతోమంది భువనేశ్వరికి అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. ఏ ఇబ్బంది ఉన్నా తాము సహకరిస్తామన్నారు.
అదిగో.. అదే సమయంలో ఎంటరయ్యాడు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి. ఆమె చేపట్టిన ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటూ భువనేశ్వరికి సన్నిహితుడిగా మారాడు. మోటివేషన్ క్లాసులు చెబుతూ ఐఏఎస్, ఐపీఎస్‌ల దగ్గరకు సూటు, బూటు వేసుకుని తిరుగుతూ కన్పించే శ్రీకాంత్‌రెడ్డి విసిరిన వలలో పడింది భువనేశ్వరి. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డి నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. శ్రీకాంత్‌లోని మరో క్రూరుడిని ఆమె గుర్తించలేకపోయింది.
డబ్బు కోసమే..
నిజానికి శ్రీకాంత్‌రెడ్డికి కావాల్సింది తన విలాసాలకు అవసరమైన డబ్బు మాత్రమేనని భువనేశ్వరి గ్రహించలేకపోయింది. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భువనేశ్వరికి నెలకు రూ.90 వేల జీతం వస్తుండటంతో ఆమెను చేసుకుంటే తన జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చన్నది శ్రీకాంత్‌రెడ్డి ప్లాన్. మూడేళ్ల క్రితం అతడిని వివాహం చేసుకున్న భువనేశ్వరి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సొంత ఇల్లు కూడా కొనుగోలు చేసింది.
ఆ తరువాత శ్రీకాంత్‌రెడ్డిలోని మోసగాడు బయటకొచ్చాడు. ఆమెకొచ్చే జీతాన్ని మింగేస్తూ.. ఎక్కడికక్కడ భారీగా అప్పులు చేయిస్తూ వచ్చాడు. భర్త బలవంతం చేయడంతో ఇటీవల తన బంధువుల వద్ద రూ.10 లక్షలు అప్పుతెచ్చి ఇచ్చింది. ఆమె పీఎఫ్ సొమ్ము, బంగారం సహా అన్నీ కాజేశాడు. చివరకు పద్ధతి మార్చుకోవాలని భువనేశ్వరి గట్టిగా చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి చంపేసి.. ఆమె కరోనాతో మరణించిందనే నాటకమాడాడు.
Comments
Please login to add a commentAdd a comment