కరువు నిర్ధారణ ప్రమాణాలు తెలియవా రామోజీ?  | Identification of drought prone areas based on four indicators | Sakshi
Sakshi News home page

కరువు నిర్ధారణ ప్రమాణాలు తెలియవా రామోజీ? 

Published Sun, Nov 19 2023 5:30 AM | Last Updated on Sun, Nov 19 2023 5:30 AM

Identification of drought prone areas based on four indicators - Sakshi

సాక్షి, అమరావతి: నిత్యం ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం. దీనికోసం ఎంతకైనా దిగజారుడు తనం. చంద్రబాబు మేలు కోసం తాపత్రయం. ఇదే రామోజీరావుకు నిత్యకృత్యం. ఇదే కోవలో కరువుపైనా విషంకక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా గుడ్డకాల్చి మీద పడేద్దాం అనే చందాన ఈనాడులో కథనం అచ్చేశారు. ఒక ప్రాంతంలో కరువు ఉందా? లేదా అని చెప్పడానికి దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలు ఉంటాయి.

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ) విధివిధానాల ప్రకారం కరువు మండలాలను ప్రకటిస్తుంటారు. రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వానికైనా.. ఇప్పటి ప్రభుత్వానికైనా, దేశంలో మరే ఇతర ప్రభుత్వాలకైనా ఈ ప్రమాణాలు, విధివిధానాలు ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు కరువును దాచేసే అవకాశమే ఉండదు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు.. కరువును ఈ ప్రభుత్వం ఏదో దాచేస్తున్నట్టుగా ఓ కథను అల్లేసింది. కొన్ని విపక్షాలు సైతం వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నాయి. 

కరువు మండలాలు గుర్తిస్తారిలా.. 
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరువు నిర్వహణ మాన్యువల్‌ ఆధారంగా మండలాన్ని యూనిట్‌గా తీసుకొని విపత్తుల నిర్వహణా సంస్థ, జిల్లా కలెక్టర్ల ద్వారా మూడు దశల్లో పరిశీలిస్తారు. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి కాదు. వాటిని మార్చడం కూడా సాధ్యం కాదు. కరువు మండలాల గుర్తింపులో మూడు దశల్లో 4 సూచికలు ఆధారంగా తీసుకుంటారు. ఈ సూచికలను మార్చడం కూడా సాధ్యం కాదు. అవి ఆయా వెబ్‌సైట్లలో అందరికీ అందుబాటులో ఉంటాయి. 

మొదటి దశ 
లోటు వర్షపాతం, వర్షంపడిన రోజులు ఆధారంగా మదింపు చేస్తారు. ఆ ప్రాంతంలో కురవాల్సిన వర్షపాతం కురిసిందా? లేదా, వర్షాలు కురవాల్సిన సమయంలో పొడి వాతావరణం ఉందా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణ వర్షపాతం కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదై, డ్రై స్పెల్స్‌ను బట్టి భూమిలో తేమ శాతం కూడా తక్కువగా ఉండే మండలాలను మొదటి దశలో పరిగణనలోకి తీసుకుంటారు.  

రెండో దశ 
ప్రధానంగా నాలుగు సూచికల ఆధారంగా అంచనా వేస్తారు. లోటు వర్షపాతం, డ్రైస్పెల్, నీటి వనరుల లభ్యత, సాగువిస్తీర్ణం పడిపోవడం పరిశీలిస్తారు. ఎంత విస్తీర్ణంలో విత్తనాలు వేశారు (సోన్‌ ఏరియా ఇండెక్స్‌ ), ఉపగ్రహం నుంచి లభించిన ఛాయా చిత్రాల ద్వారా అక్కడి పచ్చదనం ఎలా ఉన్నది (రిమోట్‌ సెన్సింగ్‌ ఇండెక్స్‌ వెజిటేషన్‌ కండీషన్‌ సూచిక), సాధారణంగా ఉండాల్సిన బాష్పిభవనం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన బాష్పిభవనం(మాయిశ్చర్‌ ఎడెక్వసీ ఇండెక్స్‌), నీటి నిల్వలు, ఆ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, నదుల్లో ప్రవాహ స్థితిగతులు (హైడ్రాలజీ ఇండెక్స్‌) పరిశీలిస్తారు. మూడు సూచికలు కరువు పరిస్థితులకనుగుణంగా ఉంటే ఆ మండలాలను ఎక్కువ కరువు ప్రభావం ఉన్న మండలాలుగా, రెండు సూచికలకు అనుకూలంగా ఉంటే ఓ మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగా పరిగణనలోకి తీసుకుంటారు.  

మూడో దశ
క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ కోసం శాంపిల్‌ సర్వే చేస్తారు. గుర్తించిన మండలాల్లోని పలు గ్రామాలను ర్యాండమ్‌గా ఎంపికచేసి సర్వే చేస్తారు. ఆ ప్రాంతాల్లో పలు యూనిట్లలో పంటల దిగుబడిని ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. కనీసం 50 శాతం పంట దిగుబడి( ఆయా మండలాల్లో సాగయ్యే ఐదు ప్రధాన పంటలు) తగ్గితే అక్కడ కరువు పరిస్థితులు ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. 

క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాతే.. 
శాస్త్రీయంగా, పక్కాగా నిర్వహించిన ఈ సర్వేలపై కలెక్టర్లు పంపిన నివేదికల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటి పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత కరువు ప్రభావిత మండలాలపై నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఇలా ఎన్‌డీఎంఏ రూపొందించిన విధివి«ధానాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అత్యంత పారదర్శకంగా కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర మార్గదర్శకాల ప్రకా­రం పక్కాగా కరువు తీవ్రతను అంచనా వేసి, ప్రతీ సూచికను ఒకటికి రెండుసార్లు శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే 679 మండలాలకు గానూ 103 మండలాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కరువు పరిస్థితులున్నట్టుగా నిర్ధారించింది. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని, 23 మండలాల్లో స్వల్పంగా ఉందని తేల్చింది.

కర్నూలు జిల్లాలలో 24, నంద్యాల జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 28,  శ్రీ సత్యసాయి జిల్లాలో 21, అన్నమ­య్య జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 4, ఎన్టీఆర్‌ జిల్లాలో 2 మండలాలు కరువు బారిన పడినట్టుగా తేల్చారు. కరువు కారణంగా అందించాల్సిన ఆర్థిక సాయం కోసం నవంబర్‌ 14న కేంద్రానికి నివేదిక పంపించారు. కరువు బాధిత ప్రాంతాల్లో సత్వర సహాయ చర్యల కోసం రూ. 688 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.  

అదనపు ప్రయోజనం లేదు 
కరువు మండలాల్లో రైతులకు కలిగే ప్రయోజనాలు స్వల్పంగానే ఉంటాయి. ఆ సీజన్‌లో వారు తీసుకున్న పంట రుణాలను ఆరు నెలల పాటు రీషెడ్యూల్‌ చేస్తారు. వైపరీత్యాల మాదిరిగానే కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటలు కోల్పోయిన వారికి ఇన్‌పుట్‌సబ్సిడీ (పంట నష్టపరిహారం) అందిస్తారు. ఈ రెండు తప్ప అదనంగా రైతులకు ప్రయోజనం ఉండదు. పాడికి మాత్రం అదనంగా పశుగ్రాసం పంపిణీ, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

అయితే ఇవన్నీ కరువు నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం ఇచ్చే కరువు సాయాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల బారిన పడి పంట నష్టం జరిగిన రైతులకు ఆ సీజన్‌ చివర్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) చెల్లిస్తోంది. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హయాంలో రూ. 1,977 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించింది.

ఉచిత పంటల బీమా ద్వారా ఆదుకునే చర్యలు 
మరోవైపు రైతులపై పైసా భారం పడకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రాప్‌ నమోదు ప్రామా­ణికంగా నోటిఫై చేసిన పంటలకు యూని­వర్సల్‌ కవరేజ్‌ కల్పిస్తూ పంటల బీమా వర్తింప చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ. 3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ. 7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లించింది.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ పథకాలు గతంలో లేవు. రైతులను ఆదుకునే విష­యంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే బురద జల్లడమే ఈనాడు పనిగా పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేకపోయినా కరువును దాచేస్తునారంటూ ఈనాడుతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయి.  
అప్పట్లో నోరు మెదపని ఈనాడు 
వాస్తవంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా కరువు కాటకాలు, తుపాన్‌లు రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సకాలంలో కరువు మండలాలను ప్రకటించకపోయినా, కరువు పరిహారం ఇవ్వకపోయినా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఏ ఒక్క రోజు రామోజీ ప్రశ్నించిన పాపాన పోలేదు.

పంటకోత ప్రయోగాలు పారదర్శకంగా చేయాలని, నష్టపోయిన ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేలా ఉండాలని ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీచేశారు. నివేదికలు రాగానే బెట్ట పరిస్థితుల వలన దిగుబడి నష్టం జరిగిన నోటిఫైడ్‌ పంటలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా  పరిహారం, దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement