‘సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అన్నందుకు విద్యార్థిపై అక్రమ కేసు
రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ ప్రశ్నకు సమాధానం చెప్పాడని చర్యలు
సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడని విన్నవించినా పట్టించుకోని దైన్యం
తమ కుమారుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే భాధ్యత అంటున్న తల్లిదండ్రులు
అసభ్యకరంగా దూషించలేదు.. ఎవరినీ కించపరచలేదు.. ఒక్కరినీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి చాలెంజ్‌లూ చేయలేదు.. అయినా కూటమి ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం.. ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘కూటమి పార్టీలు ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అని అభిప్రాయం చెప్పడమే ఆ విద్యార్థి పాలిట శాపమైపోయింది.
అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ను పట్టుకోవడానికి వచ్చినట్లు.. క్రైమ్, సస్పెన్స్ సినిమాలను తలదన్నేలా గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. కోడి కూయక ముందే సీఐడీ పోలీసుల బృందం గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆ విద్యార్థిని పట్టి బంధించింది. ఆపై ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఇన్నోవాలో ఎక్కించుకుని వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ఏమనాలి? బహుశా తాలిబన్లు కూడా ఇలా వ్యవహరించి ఉండరు!
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామం బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామున సీఐడీ పోలీసులు గ్రామంలోకి వచ్చారు. గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అలజంగి యఘ్నేష్ ఇంటిని చుట్టుముట్టారు. తీరా చూస్తే ఎప్పుడో రెండేళ్ల కిందట కూటమి పార్టీలపై తన అభిప్రాయం చెప్పాడని, గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ‘సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అన్నందుకు ఇప్పుడు ఈ విద్యార్థిపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు.
అసలు ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏమని ఫిర్యాదు చేశారు.. తమ కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక తల్లిదండ్రులు వెంకటనాయుడు, వెంకటరత్నంలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టారు. ఎవరని ప్రశ్నిస్తే యఘ్నేష్ స్నేహితులమని చెప్పారు. తలుపు తీసి చూస్తే పోలీసులు. మంచంపై నిద్రపోతున్న మా కుమారుడిని పట్టుకున్నారు. యఘ్నేష్‌తో చిన్న పని ఉంది.. అరగంటలో మళ్లీ వచ్చేస్తాం అన్నారు. పార్వతీపురంలోని భాస్కర్ డిగ్రీ కాలేజీలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు.
మంగళవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో వారం రోజుల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పినా వినిపించుకోలేదు’ అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. యఘ్నేష్‌కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పట్టుకుపోవడం తగదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా, యఘ్నేష్‌ను సీఐడీ పోలీసులు గుంటూరు తీసుకెళ్లారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment