ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 80 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. పాత తేదీలతో తప్పుడు పత్రాలు సృష్టించి మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.100 కోట్ల విలువైన సర్కారు భూమిని తమ కుటుంబం ఆధీనంలోని ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించుకుంది. డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలం, అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి గురునాథం ద్వారా ఈ వ్యవహారం నడిపించినట్లు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. వేణుగోపాలాన్ని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేసి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ నెల 23 వరకు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
పాత తేదీతో తప్పుడు సర్టిఫికెట్..
సంగం డెయిరీ ఆస్తులను స్వాహా చేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం పక్కా ప్రణాళిక రచించింది. నరేంద్ర భార్య జ్యోతిర్మయి చైర్మన్‌గా ఉన్న ట్రస్ట్‌కు ఆస్తులను బదలాయించి కాజేయాలని పథకం వేశారు. 2012 సెప్టెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం సహకార సొసైటీల ఆస్తుల బదలాయింపుపై కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం ధూళిపాళ్ల కుటుంబానికి అడ్డంకిగా మారింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సొసైటీ ఆస్తులతో కొత్తగా ప్రొడ్యూసర్ కంపెనీ (ట్రస్ట్‌గానీ మరేదైనాగానీ) ఏర్పాటు చేయాలంటే జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) పొందడం తప్పనిసరి. డెయిరీ ఆస్తులను తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించేందుకు 2012 సెప్టెంబర్‌లో ధూళిపాళ్ల కుటుంబం ప్రయత్నించగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి శ్రీకాంత్ అంగీకరించలేదు.
ఇందులో ఏదో మతలబు ఉందని గుర్తించి ఫైల్ పెండింగ్‌లో పెట్టారు. ఇది బెడిసికొట్టడంతో ధూళిపాళ్ల కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారిగా రిటైరైన గురునాథం పేరుతో కథ నడిపించింది. ఇందుకోసం సంగం డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలాన్ని వినియోగించుకుంది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు ఏవీ లేవని 2011 ఫిబ్రవరి 26వ తేదీతో ఓ తప్పుడు సర్టిఫికెట్ తయారు చేశారు. దానిపై ఫిబ్రవరి 28న రిటైరైన గురునాథం సంతకం ఉంది. తప్పుడు మార్గంలో సృష్టించిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించి ప్రభుత్వానికి చెందిన 80 ఎకరాలను ధూళిపాళ్ల కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు బదిలీ చేసింది.
తీగ లాగితే కదిలిన డొంక...
సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణలో ఈ బాగోతం బట్టబయలైంది. డెయిరీ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయడంలో నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని ఏసీబీ గుర్తించింది. ఆస్తుల బదిలీకి ఎన్‌వోసీ ఎలా వచ్చిందనే అంశంపై కూపీ లాగడంతో డొంక కదిలింది. అంతకుముందు డెయిరీ ఆస్తుల జాబితాలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా... ట్రస్ట్‌కు బదిలీ చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఆస్తులు లేవని సర్టిఫికెట్ జారీ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ అంశంపై లోతుగా విచారించడంతో అసలు వ్యవహారం బహిర్గతమైంది. గుంటూరు జిల్లా సహకార శాఖ కార్యాలయంలో ఎన్‌వోసీ జారీకి ముందు ఎలాంటి రిఫరెన్స్ ఫైళ్లు తయారు చేసినట్లు రికార్డుల్లో లేవు. ఇన్‌వర్డ్, అవుట్ వర్డ్ ఫైళ్ల రికార్డులు లేవు. పాత తేదీతో వంగల వేణుగోపాలం తయారు చేసిన సర్టిఫికెట్‌పై అప్పటికే రిటైరైన గురునాథం సంతకం చేశారని వెల్లడైంది. ఈ మేరకు సంగం డెయిరీ రికార్డులను పూర్తి ఆధారాలుగా ఏసీబీ అధికారులు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment