సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మున్నేరు నుంచి లారీల్లో ఇసుక తరలిపోతోంది. జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఇసుక అక్రమ తవ్వకాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అక్రమ తవ్వకాలను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు రైతులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు జరిగితే మున్నేరులో కోత ఏర్పడి తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల మంచినీటి స్కీం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.
మరోవైపు, నిషేధిత యనమలకుదురు ఇసుక క్వారీలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో విజయవాడకు కూతవేటు దూరంలో ఇసుకమాఫియా పేట్రేగిపోతున్నా.. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తిచూడటం లేదు. ఇసుక మాఫియా ఇక్కడ్నుంచి భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటుండగా, టీడీపీ నేతలు అక్రమార్కులకు సహకరిస్తూ ఇసుకను కాజేస్తుండటం గమనార్హం.
పొంచి ఉన్న ప్రమాదం
కృష్ణానదిపై కనకదుర్గ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత దశాబ్దకాలం కిందట యనమలకుదురు క్వారీని ప్రభుత్వం నిషేధిత క్వారీగా ప్రకటించింది. అపట్నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక యనమలకుదురు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ తవ్వకాలతో కనక దుర్గవారధితోపాటు యనమలకుదురు గ్రామానికి కూడా ప్రమాదం పొంచి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment