అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. | Immunity Increases With Meat | Sakshi
Sakshi News home page

మాంస‘మేలు’

Published Sun, Aug 30 2020 10:53 AM | Last Updated on Sun, Aug 30 2020 10:53 AM

Immunity Increases With Meat - Sakshi

కరోనా వైరస్‌ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీర అవయవాలపై అధికంగా దాడి చేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ఆస్పత్రి పాలు చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా జనం సవాలక్ష మార్గాల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. వ్యాధి నిరోధక శక్తి మరింత పెంచుకోవాలని వైద్యులు సూచించేలా చేస్తోంది. ఆరోగ్యానికి మాంసాహారమే ఉత్తమ మార్గమని జనం భావించేలా చేసింది. నిన్నమొన్నటి వరకు వెల వెలబోయిన నాన్‌వెజ్‌ వ్యాపారాలు నేడు పుంజుకునేలా మార్చింది. వైరస్‌ అంతం.. ఇమ్యూనిటీ పంతం అనేలా తెచ్చింది. జిల్లాలో మాంసం వినియోగం పెరగడంపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌.. 

చిత్తూరు కలెక్టరేట్‌: అసలే కరోనా కాలం. రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లు, పోషకాలు చికెన్‌లో అధికంగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. కరోనా ప్రారంభమైన మొదట్లో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం నెల రోజులుగా పతాక స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి మాంసం, గుడ్ల వినియోగం పెరిగింది.  

గతంలో..
కరోనా వైరస్‌ ప్రారంభంలో చికెన్, మటన్‌ తింటే వైరస్‌ సోకుతుందనే ప్రచారం సాగింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒక్కసారిగా వాటి వినియోగం పడిపోయింది. గతంలో రోజుకు 15 లక్షల కోడిగుడ్లు విక్రయాలు జరుగుతుండేవి. కరోనా ఎఫెక్ట్‌తో 4 లక్షలకు అమ్మకాలు పడిపోయింది. చికెన్‌ కూడా అంతకుముందు నెలకు 6.5 లక్షల టన్నుల వరకు విక్రయించేవారు. కరోనా వల్ల 2 లక్షల టన్నులకు పడిపోయింది. కరోనా ప్రారంభమైన మా తీరని నష్టం వాటిల్లింది. అప్పట్లో కోళ్లు, కోడిగుడ్లు ఎక్కువగా నిల్వ ఉండడంతో తక్కువ ధరకు కొందరు విక్రయించేశారు. మరికొంతమంది వ్యాపారులు ఉచితంగా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి.  

ఇప్పుడు..
చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న భయాన్ని నిపుణులు పోగొట్టారు. సాక్షాత్తు వైద్యులే చికెన్, మటన్, కోడిగుడ్లు తినాలని సూచించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ప్రజలు వీటిని వినియోగించడం ప్రారంభించారు. ఇందులో విచిత్రమేమిటంటే కరోనా కేసులు ఎక్కువైన సమయంలో వాటి వినియోగం పెరిగింది. చికెన్‌ ధర కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కోడిగుడ్డు ధర రూ.2.50 నుంచి రూ.5 చేరింది. ధర పెరిగినా వినియోగదారులు ఏమాత్రం తగ్గడం లేదు.  

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని.. 
కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు కండ పుష్టి పొందడానికి, ఎముకల బలానికి, ప్రొటీన్లు, పోషకాల పెంపు కోసం చికెన్‌ తినడం ప్రారంభించారు. చికెన్‌లో చాలా రకాల పోషకాలుంటాయని వైద్యులు సలహాలిస్తున్నారు. చికెన్‌లో అమినో యాసిడ్స్‌ ఉండడం వల్ల శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుందని అంటున్నారు. మినరల్స్‌గా పిలుచుకునే సెలినీయం పోషకం ఉండడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. విటమిన్‌– బీ5, పాంటోథెనిక్‌ ఆమ్లం వంటివి ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయని వైద్యులు చెబుతున్నారు. చికెన్‌ తినడం వల్ల గుండెనొప్పి, ఇతర సమస్యలను తగ్గిస్తుందని, విటమిన్‌– బీ6 అధికంగా ఉండడంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చికెన్‌లో జింక్‌ అధికంగా ఉండడంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.  

పెరిగిన వినియోగం 
జిల్లాలో చికెన్, మటన్‌ వినియోగం గతంలో కంటే అధికంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజు మార్చి రోజు చికెన్‌ తింటున్నారు. బాయిలర్‌ చికెన్‌తో పాటు నాటుకోడి మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మటన్, కోడిగుడ్లకు కూడా ప్రాధాన్యమిçస్తున్నారు. మటన్‌ అతిగా తీసుకోకూడదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారంలో రెండు రోజులు మాంసం తీసుకోవచ్చని, పూటకు సగటున 300 గ్రాముల మాంసం తీసుకుంటే సరిపోతుందంటుని చెబుతున్నారు. జిల్లాలో మటన్‌తో పాటు నాటు కోడి మాంసం ధర పెరిగింది. మటన్‌ కిలో రూ.800 నుంచి రూ.900 వరకు పెరిగింది. నాటుకోడి మాంసం ధర కిలో రూ.600 దాటింది. బాయిలర్‌ కోడి మాంసం ధర కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉంటోంది. కరోనా వల్ల మొదట్లో పూర్తిగా నష్టపోయిన చికెన్‌ వ్యాపారులు ప్రస్తుతం ఆర్థికంగా పుంజుకుంటున్నారు.  

ఉచితంగా పంపిణీ చేశాం 
కోవిడ్‌ వచ్చిన మొదట్లో చికెన్‌ ధరలు పడిపోయాయి. కొనే వారు లేక చికెన్, కోళ్లు ఉచితంగా పంపిణీ చేశాం. ఎక్కువ రోజులు కోళ్లు నిల్వ చేసుకోలేక రెగ్యులర్‌ కస్టమర్లకు ఉచితంగా పంచిపెట్టాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అమ్మకాలు జోరందుకున్నాయి. మదనపల్లెలో కిలో చికెన్‌ ధర రూ.150 వరకు పలుకుతోంది.  
– మైనుద్దీన్, చికెన్‌ వ్యాపారి 

జాగ్రత్తలు ముఖ్యం 
జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదు. ఒకవేళ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజుల పాటు కఠోర సాధన చేస్తే కరోనాను జయించవచ్చు. ధాన్యం, యోగా, ఆధ్యాత్మిక చింతనతో గడిపితే చాలు. పోషకాహారాలు తీసుకున్న వారికి కరోనా రాదు. కరోనాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. 
– మహేష్‌నారాయణ, యోగా సాధకులు

వ్యాపారాలు వృద్ధి చెందాయి 
కరోనా వచ్చిన మొదట్లో అపోహలతో చాలా నష్టపోయాం. చికెన్, కోడిగుడ్లు తినకూడదని అప్పట్లో తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కొనడానికి ఎవరూ ముందుకొచ్చే వారు కాదు. రోజుకు 8 లక్షల కోడిగుడ్లు అమ్మాలంటే గగనంగా ఉండేది. ప్రస్తుతం రోజుకు 15 లక్షల వరకు కోడిగుడ్లు అమ్ముడవుతున్నాయి. ధరలు కూడా పెరిగాయి. 
– హరినాయుడు, ఎస్‌ఆర్‌పురం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement