సాక్షి, అమరావతి: వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా లేఅవుట్‌లలో 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా.. రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 17.66 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఆయా కాలనీల్లో రూ.32 వేల కోట్లకు పైగా నిధులతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇప్పటికే కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు చకచకా ఇస్తున్నారు. ఇదిలావుండగా శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. అలాకాకుండా సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక్కో గుంతకు రూ.6 వేలు
ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, తొలి దశలో 7,278 కాలనీల్లో 1,11,770 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్‌ల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు/వార్డు ఎమినిటీ సెక్రటరీలకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరికి గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగంతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రారంభించారు.
భూగర్భ జలం పెరుగుతుంది
ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం వినియోగిస్తాం. పూర్తి స్థాయిలో డ్రెయిన్లు, కాలువలు నిర్మించిన అనంతరం ఇంట్లో వృథాగా పోయే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఈ గుంతల్లోకి చేర్చవచ్చు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. కాలనీల్లో పెద్దఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుంది. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment