inkudu gunta
-
లక్ష్యం చేరేనా..?
మహబూబ్‌నగర్: ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకేటట్లుగా భూగర్భజలాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కానీ వాటి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ప్రతి పల్లెలో మురుగుకాల్వల చివరన సామాజిక ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలిన భావించారు. గతంలో ఇంటింటికీ ఇంకుడుగుంత ఉండాలని విస్తృత ప్రచారం చేసిన అధికారులు, ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకం కింద జిల్లాలో ప్రతి గ్రామానికి ఐదు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. గ్రామాల్లో మురుగుకాల్వల చివరి స్థలాల్లో వీటిని తవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీల్లో 1,400 ఇంకుడుగుంతలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు నెలల్లో 279 మాత్రమే నిర్మించారు. వీటి నిర్మాణానికి డ్రెయినేజీల చివరన స్థలసమస్య శాపంగా మారింది. గతంలో నిర్మించినవి నిరుపయోగం.. గతంలో నిర్మించుకున్న ఇంకుడుగుంతల్లో వర్షపు నీటిని మళ్లించే విధంగా చర్యలు చేపట్టకపోవడంతో ఆవి నిరుపయోగంగా మారుతున్నాయి. లక్ష్యం కోసం నిర్మించిన వాటిలోకి వృథా నీటిని మళ్లిస్తే భూగర్భజలాలు పెరగడంతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో శుభ్రత నెలకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో వీటిపై ప్రజల్లో కొంత అవగాహన పెరిగి నిర్మాణాలపై దృష్టి సారించినప్పటికే కొన్నేళ్లుగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రోత్సాహక డబ్బు సకాలంలో అందక లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. వెంటనే డబ్బు చెల్లించేలా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరంఉంది. పూర్తి చేస్తాం.. ప్రతి గ్రామానికి మంజూరైన సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు గాను 1400 గుంతలు తవ్వాలి. ప్రస్తుతం 279 పూర్తి చేశాం. మిగతా వాటిని కూడా పూర్తిచేయిస్తాం. – గోపాల్‌నాయక్, డీఆర్డీఓ నిర్మాణాలకు నిధులు ఇలా.. ఇళ్ల వద్ద ఇంకుడుగుంతలు తవ్వుకోవడం, గ్రామ పంచాయతీల్లో సామాజిక గుంతలను నిర్మిస్తే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ ద్వారా కుంటల పునరుద్ధరణ, అటవీ ప్రాంతాల్లో సమతుల కందకాలు, రైతుల పంట పొలాల్లోని వృథా నీటికి అడ్డుకట్టు వేసేందుకు నీటినిల్వ గుంతల నిర్మాణానికి చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్లలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే రూ.6,616 చెల్లిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మురుగునిల్వ ఉండేందుకు పంచాయతీల్లో సామాజిక గుంతల నిర్మాణం చేపడితే రూ.13,496 వరకు చెల్లిస్తున్నారు. -
ఇంటికో ఇంకుడు గుంత
సాక్షి, అమరావతి: వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా లేఅవుట్లలో 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా.. రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 17.66 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఆయా కాలనీల్లో రూ.32 వేల కోట్లకు పైగా నిధులతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇప్పటికే కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు చకచకా ఇస్తున్నారు. ఇదిలావుండగా శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. అలాకాకుండా సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గుంతకు రూ.6 వేలు ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, తొలి దశలో 7,278 కాలనీల్లో 1,11,770 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్ల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డు ఎమినిటీ సెక్రటరీలకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరికి గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలం పెరుగుతుంది ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం వినియోగిస్తాం. పూర్తి స్థాయిలో డ్రెయిన్లు, కాలువలు నిర్మించిన అనంతరం ఇంట్లో వృథాగా పోయే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఈ గుంతల్లోకి చేర్చవచ్చు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. కాలనీల్లో పెద్దఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుంది. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
ఇంటికో ఇంకుడు గుంత ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మహానగరం మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన రాజధాని గ్రేటర్హైదరాబాద్ నగరంలో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను ఉద్యమస్ఫూర్తితో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నెలలోనే ప్రతి ఇళ్లు, అపార్ట్మెంట్, కార్యాలయం, పరిశ్రమ, ఆవరణలో వీటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇళ్లలో రీఛార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంత) ఇలా ఉండాలి.. మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి.1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి.మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటుచేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీఛార్జీ సులువవుతుంది. మీ బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి ఇళ్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుందని తెలిపారు. చతుర్విధ జలప్రక్రియతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టండిలా.. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు,రెండు మీటర్ల పొడవు,రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా,ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈనీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. (క్లిక్: 1996 నాటి ఘటన.. కలెక్టర్ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి) -
'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'
కాకినాడ: పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. పోలవరానికి పట్టిసీమ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం అయితే పోలవరాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వచ్చేనెల లోపు రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకు.. చంద్రబాబు జాతకం కూడా ఇంకుడు గుంతేనని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన మోదీ, వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తులు పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని చెప్పారు.