మహబూబ్‌నగర్: ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకేటట్లుగా భూగర్భజలాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కానీ వాటి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ప్రతి పల్లెలో మురుగుకాల్వల చివరన సామాజిక ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలిన భావించారు. గతంలో ఇంటింటికీ ఇంకుడుగుంత ఉండాలని విస్తృత ప్రచారం చేసిన అధికారులు, ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకం కింద జిల్లాలో ప్రతి గ్రామానికి ఐదు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. గ్రామాల్లో మురుగుకాల్వల చివరి స్థలాల్లో వీటిని తవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీల్లో 1,400 ఇంకుడుగుంతలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు నెలల్లో 279 మాత్రమే నిర్మించారు. వీటి నిర్మాణానికి డ్రెయినేజీల చివరన స్థలసమస్య శాపంగా మారింది.
గతంలో నిర్మించినవి నిరుపయోగం..
గతంలో నిర్మించుకున్న ఇంకుడుగుంతల్లో వర్షపు నీటిని మళ్లించే విధంగా చర్యలు చేపట్టకపోవడంతో ఆవి నిరుపయోగంగా మారుతున్నాయి. లక్ష్యం కోసం నిర్మించిన వాటిలోకి వృథా నీటిని మళ్లిస్తే భూగర్భజలాలు పెరగడంతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో శుభ్రత నెలకొనే అవకాశం ఉంటుంది.
జిల్లాలో వీటిపై ప్రజల్లో కొంత అవగాహన పెరిగి నిర్మాణాలపై దృష్టి సారించినప్పటికే కొన్నేళ్లుగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రోత్సాహక డబ్బు సకాలంలో అందక లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. వెంటనే డబ్బు చెల్లించేలా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరంఉంది.
పూర్తి చేస్తాం..
ప్రతి గ్రామానికి మంజూరైన సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు గాను 1400 గుంతలు తవ్వాలి. ప్రస్తుతం 279 పూర్తి చేశాం. మిగతా వాటిని కూడా పూర్తిచేయిస్తాం. – గోపాల్‌నాయక్, డీఆర్‌డీఓ
నిర్మాణాలకు నిధులు ఇలా..
ఇళ్ల వద్ద ఇంకుడుగుంతలు తవ్వుకోవడం, గ్రామ పంచాయతీల్లో సామాజిక గుంతలను నిర్మిస్తే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ ద్వారా కుంటల పునరుద్ధరణ, అటవీ ప్రాంతాల్లో సమతుల కందకాలు, రైతుల పంట పొలాల్లోని వృథా నీటికి అడ్డుకట్టు వేసేందుకు నీటినిల్వ గుంతల నిర్మాణానికి చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఇళ్లలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే రూ.6,616 చెల్లిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మురుగునిల్వ ఉండేందుకు పంచాయతీల్లో సామాజిక గుంతల నిర్మాణం చేపడితే రూ.13,496 వరకు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment