సాక్షి, హైదరాబాద్: మహానగరం మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన రాజధాని గ్రేటర్‌హైదరాబాద్ నగరంలో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను ఉద్యమస్ఫూర్తితో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నెలలోనే ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయం, పరిశ్రమ, ఆవరణలో వీటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
ఇళ్లలో రీఛార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంత) ఇలా ఉండాలి..
మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి.1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి.మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటుచేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీఛార్జీ సులువవుతుంది. మీ బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి ఇళ్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుందని తెలిపారు.
చతుర్విధ జలప్రక్రియతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టండిలా..
200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు,రెండు మీటర్ల పొడవు,రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా,ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్‌సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి.
ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్‌లో నిల్వ చేసిన ఈనీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. (క్లిక్: 1996 నాటి ఘటన.. కలెక్టర్ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి)
Comments
Please login to add a commentAdd a comment