
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్.
భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు.
ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ.
water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92
— Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023