టీడీపీ నేత లోకేశ్‌తో ఆయన సన్నిహితుడు కిలారు రాజేశ్ (ఫైల్)
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో సాగించిన కుంభకోణాల్లో పాత్రధారుల పరారీ పరంపర కొనసాగుతోంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేశ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎప్పుడూ లోకేశ్ వెన్నంటే ఉండే రాజేశ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా రాజేశ్ మాత్రం ఎక్కడున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతోనే అతడు పరారైనట్లు టీడీపీ వర్గాలే చెబుతుండటం గమనార్హం.
నిధుల తరలింపులో పాత్రధారి..
నారా లోకేశ్‌కు కిలారు రాజేశ్ అత్యంత సన్నిహితుడన్నది బహిరంగ రహస్యం. చినబాబు తరపున అన్ని వ్యవహారాలను నెరిపేది రాజేశే. కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేశ్ చెప్పిన దానికే లోకేశ్ మొగ్గు చూపుతారని టీడీపీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. రాజేశ్ పరోక్షంగా టీడీపీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు జరపడంతోపాటు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ రాజేశ్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే చంద్రబాబు కంటే రాజేశ్ వద్దకు వెళితేనే పని అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు రాజేశ్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు.
షాడో మంత్రి.. నెట్‌వర్క్‌లో కీలకం
టీడీపీ హయాంలో లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు రాజేశ్ షాడో మంత్రిగా చెలరేగిపోయాడు. అన్ని ఫైళ్లను అనధికారికంగా అతడే చూసేవాడని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు, లోకేశ్ సూత్రధారులుగా సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ రాజేశ్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్టుల ఖరారు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు.. ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ప్రధానంగా వినిపించిన పేరు కిలారు రాజేశ్.
అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల తరలింపు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌కు కిలారు రాజేశ్ సంధాన కర్తగా వ్యవహరించాడు. అదే విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు, లోకేశ్ ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లో కిలారు రాజేశ్‌ను కూడా విచారిస్తామని సీఐడీ అదనపు ఎస్పీ సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అతడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతోనే విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కిలారు రాజేశ్ అదృశ్యం కావడం గమనార్హం.
మూడుకు చేరుకున్న అదృశ్యాలు..
కిలారు రాజేశ్‌ను విచారించాలని సీఐడీ నిర్ణయించడంతో చంద్రబాబు, లోకేశ్ బెంబేలెత్తారు. అతడిని సీఐడీ విచారిస్తే టీడీపీ హయాంలో సాగించిన మరెన్నో కుంభకోణాలు బయటకు వస్తాయని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో రాజేశ్‌ను అజ్ఞాతంలోకి పంపించాలని నిర్ణయించిన చంద్రబాబు అదే విషయాన్ని ములాకత్లో తనను కలిసిన యనమల రామకృష్ణుడుకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రాజేశ్ అదృశ్యమయ్యాడు. అతడు దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నాడా...? విదేశాలకు పరారయ్యాడా? అన్నది తెలియరాలేదు. దీంతో చంద్రబాబు ఆదేశాలతో పరారైన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. స్కిల్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్‌కు పరారైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment