సాక్షి, అమరావతి: అనారోగ్యం వస్తే డాక్టర్ వద్దకు వెళ్లడం.. జబ్బు లక్షణాన్ని బట్టి వైద్యులు పరీక్షించి మందులు రాయడం అందరికీ తెలిసిందే. అదే పని ఒక రోబో చేస్తే?.. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్సీ గురుకుల విద్యార్థినులు డాక్టర్ రోబోను ఆవిష్కరించారు.
విశాఖపట్నంలోని మధురవాడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు చెందిన విద్యార్థినులు జెస్సికా (10వ తరగతి), కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు (9వ తరగతి)లు ఫిజికల్ సైన్స్ టీచర్ డాక్టర్ టి. రాంబాబు పర్యవేక్షణలో ‘డాక్టర్ రోబో’ కాన్సెప్‌్టను రూపొందించారు. ఈ ప్రాజెక్టు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2021–22 టాప్‌టెన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. దీంతో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు హ్యాట్రిక్ సాధించినట్లైంది.
ఏటీఎల్ మారథాన్‌లో ఏడు వేల ప్రాజెక్టులు..
నీతి ఆయోగ్ పరిధిలో అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా నిర్వహించే ఏటీఎల్‌లో విద్యార్థుల మేధస్సుకు పోటీపెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను రూపొందించేలా చేస్తున్నారు. ఏటీఎల్–మారథాన్ 2021–22ను ఎంటర్‌ప్రెన్యూర్ ఇంటర్న్‌షిప్ పేరుతో ఈ ఏడాది జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించారు.
బెంగళూరులో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 వేల మంది 7వేల ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటి నుంచి తొలిదశలో 350 ప్రాజెక్టులు, మలిదశలో వాటి నుంచి వంద ప్రాజెక్టులు, ఆ తర్వాత అందులోని 30 ప్రాజెక్టులు, చివరకు టాప్‌టెన్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థుల డాక్టర్ రోబో ప్రాజెక్టు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణం.
డాక్టర్ రోబో పనితీరు ఇలా..
డాక్టర్ రోబో కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. రోగి తన పరిస్థితిని రోబోకు వివరిస్తే అతను వాడాల్సిన మందులను స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయడంతోపాటు ఔషధాలను ఇస్తుంది. రోగికి ఇంకా ఏదైన సమస్య ఉంటే రోబో ప్రత్యేక వైద్యులకు వీడియోకాల్ చేసి కనెక్ట్ చేస్తుంది. రోగి వారితో మాట్లాడి వైద్య సహాయం పొందవచ్చు.
అలాగే, ఏఏ ప్రాంతాల్లో వైద్యనిపుణులున్నారు? ఏ రోగానికి ఏ వైద్యుడ్ని సంప్రదించాలి? అవసరమైన వైద్యులు బిజీగా ఉంటే ఏ సమయంలో అందుబాటులోకి వస్తారు? వంటి సమాచారాన్ని డాక్టర్ రోబో అందిస్తుంది. ఇక ఈ రోబో రోగి దగ్గరకే వెళ్లి వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
డాక్టర్ రోబో వినియోగంలోకి వస్తే మేలు..
పెరుగుతున్న వైద్య అవసరాలకు తగ్గట్లు డాక్టర్ రోబో కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది చాలా మేలు చేస్తుంది. కోవిడ్ సమయంలో డాక్టర్‌ను సంప్రదించడం, వైద్యసేవలు అందించడం వంటి అనేక సమస్యలకు మార్గం చూపేలా డాక్టర్ రోబోను ఆవిష్కరించాం.
ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ డెవలప్‌చేశాం. ఇది డాక్టర్‌లా సేవలు అందించడమే కాదు.. డాక్టర్లకు కూడా సహాయకుడిగా ఉపయోగపడుతుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు బెంగళూరులో జరిగే గ్లోబల్ బృందం పరిశీలనలో మా ప్రాజెక్టు ఎంపికైతే వైద్య రంగంలో మరింత మేలుచేసే రోబో అందుబాటులోకి వస్తుంది.
– జెస్సికా, కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు, విద్యార్థినులు
ఎస్సీ గురుకులాల హ్యాట్రిక్
విద్యార్థుల్లో మేధస్సును మెరుగు పెట్టేలా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కృషిచేస్తోంది. ఏటీఎల్ ప్రాజెక్టుల ప్రదర్శనలో మూడేళ్లుగా ఎస్సీ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్‌టెన్‌లో నిలవడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో మన విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణం.
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment