చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) శనివారం స్థానిక వైఎస్సార్ సభావేదిక ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉషశ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే.నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. కలెక్టర్ హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు.
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల లు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో సప్లయ్‌చానల్స్ సర్వే చేసి, వాటి మరమ్మతు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు.
అన్ని రంగాల్లో ప్రగతి పరుగు
చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఇన్‌చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు అధునాతన సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు. మందుల కొరత లేకుండా అందుబాటులో పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.
శాఖల వారీగా చర్చ
∙పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలో రూ.318.19 కోట్లతో 72,272 గృహాల నిర్మాణంలో 72 శాతం గ్రౌండింగ్ చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారని జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ పద్మనాభం వివరించారు. జిల్లాలో రూ.316.70 కోట్లతో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో నాడు నేడు పథకం రెండో విడతలో 783 పాఠశాలల్లో రూ.217 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి వివరించారు. రెండో విడతలో 784 అదనపు తరగతులను నిర్మించనున్నట్లు చెప్పారు.
నాడు నేడు పథకంలో జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.11.95 కోట్లతో పనులు చేపడుతున్నామని డీఎంహెచ్‌ఓ శ్రీహరి వివరించారు.
∙జిల్లాలోని 370 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని సర్వే శాఖ ఏడీ గిరి« తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 1,50,682 జాబ్‌కార్డులు కలిగిన వారికి 79,68,671 పని దినాలు కల్పించినట్లు డ్వామా పీడీ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు రూ.181.311 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, మిల్క్ బల్క్ యూనిట్ల శాశ్వత భవనాల పనులను నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు మేయర్ అముద, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డీసీసీబీ చైర్ పర్సన్ రెడ్డెమ్మ, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ...
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జేసీలతోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పథకాల అమలులో చిత్తూరు జిల్లా ముందుండేలా పనిచేయాలని చెప్పారు.
పార్టీలకతీతంగా
కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే.రోజా అన్నారు. నాడు–నేడు పథకంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయని చెప్పారు. చెరువులు, శ్మశానవాటికలు ఆక్రమణకు లోనుకానుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment