సాక్షి, పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరులో జనసేన పార్టీ శ్రేణుల మధ్య వర్గ పోరు భగ్గుమంది. గ్రామంలోని కోళ్లఫారం వద్ద జనసేన పార్టీకి చెందిన రెండు వర్గాలు కత్తులతో, కర్రలతో మంగళవారం దాడికి తెగబడ్డాయి. పెడన–గుడివాడ హైవే పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. సినిమాల్లోని పోరాట సన్నివేశాలను తలపించేలా సమ్మెట బాబు వర్గం కత్తులతో దాడులకు తెగబడటంతో యడ్లపల్లి రామసుధీర్ వర్గం హడలిపోయింది.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ పెడన నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు యడ్లపల్లి రామసుధీర్, సమ్మెట బాబు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు వర్గాలు ఎక్కడైనా తారసపడితే పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సమ్మెట బాబు వర్గానికి చెందిన వ్యక్తులు రామసుధీర్ వర్గంపై కత్తులు, కర్రలతో దాడి చేయడంతో ఆ వర్గానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అనుచిత పోస్టింగ్‌ల వల్లే వివాదం!
రెండు వర్గాల వారు వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టడం వల్లే ఈ దాడులు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. నడుపూరు గ్రామానికి చెందిన సింగంశెట్టి అశోక్‌కుమార్(35) గుడివాడ రోడ్డులో కోళ్లఫారం నడుపుతున్నాడు. మంగళవారం అశోక్‌కుమార్, కొఠారి మల్లిబాబు(35), మద్దాల పవన్(28)లతో పాటు మరో ముగ్గురు కోళ్లఫారం వద్ద ఉండగా.. సమ్మెట బాబు వర్గానికి చెందిన బత్తిన హరిరామ్, మెట్టా గణపతి, కనపర్తి వెంకన్న, సమ్మెట శివనాగప్రసాద్, పినిశెట్టి భరత్ శివశంకర్, దాసరి సుబ్రహ్మణ్యం, ముద్దినేని రామకృష్ణ కలిసి అక్కడకు వచ్చారు.
వాట్సాప్‌లో పెట్టిన పోస్టింగ్‌ల విషయమై రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో రెండు వర్గాలు కత్తులు, తాటి మట్టలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అశోక్‌కుమార్‌తోపాటు కొఠారి మల్లిబాబు, మద్దాల పవన్ అనే వారు కత్తిపోట్లకు గురయ్యారు. మరో వ్యక్తికి కర్ర దెబ్బలు తగిలాయి. నలుగురినీ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment