సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్, అతనికి సహాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులను అనంతపురం జిల్లా హిందూపురం వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్ కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
విచారణ కోసం వెళ్లగా.. హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్ అనే వ్యక్తిని అక్కడ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఉదయ్సింహారెడ్డిని అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించింది. గిరీష్ అక్రమ నిర్బంధంలో ఉంటే తీసుకురావాలని అడ్వొకేట్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 21న ఉదయ్‌సింహారెడ్డి హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అతనికి సహాయకులుగా కోర్టు సిబ్బంది, గిరీష్ తరఫు న్యాయవాది, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్ పోలీసుల నిర్భంధంలో ఉన్నారని, అతన్ని పోలీసులు కొట్టినట్టు అడ్వొకేట్ కమిషనర్ గుర్తించారు.
అతనికి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్‌స్పెక్టర్‌ను ఉదయ్‌సింహారెడ్డి కోరారు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్ కమిషనర్‌తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సదరు ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరారు. అయితే, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో జడ్జి ఈ విషయాన్ని డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా జడ్జి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జడ్జి సైతం హైకోర్టుకు ఓ నివేదిక పంపారు.
ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమోటో పిల్‌గా పరిగణించాలని, తగిన ఉత్తర్వుల నిమిత్తం సీజే ముందుంచాలని జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాత డీజీపీ స్పందిస్తూ.. బాధ్యుౖలెన పోలీసులకు శిక్ష విధించామని, రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేశామని కోర్టుకు నివేదించారు. జిల్లా జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు దీనిని సుమోటోగా పిల్‌గా పరిగణించాలని నిర్ణయించింది. ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment