సాక్షి, అమరావతి: కరోనా అనంతరం ఐటీ రంగంలో పరిస్థితులు, పరిణామాలను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు విజయవాడలో శుక్రవారం ఐటీ, ఎల్రక్టానిక్స్ సంస్థల సీఈవోలతో ఐటీ సీటీవో కాన్‌క్లేవ్ నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి 50కి పైగా కంపెనీల సీఈవోలు, ఎండీ స్థాయి అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. అమెజాన్, ఫేస్‌బుక్, సామ్‌సంగ్, గూగుల్ క్లౌడ్, ఫ్లాక్స్‌కాన్, హెచ్‌టీసీ, ఫుజి, మోర్గాన్ స్టాన్లీ వంటి అనేక బహుళజాతి సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో సదస్సు ప్రారంభం అనంతరం వివిధ అంశాలపై రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన అవసరాలు, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ సదస్సు సందర్భంగా వివరించనున్నారు. ఐటీ, ఎల్రక్టానిక్స్ సంస్థలతో జరిగే ఈ సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైపుణ్యం, ఉపాధి, కాన్సెప్ట్ సిటీలు, ఇంటర్నెట్ లైబ్రరీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో కరోనా ప్రభావం చూపని విధంగా వినూత్నమైన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ఉపాధి ఆధారంగా రాయితీలు
అంతకుముందు మంత్రి మేకపాటి ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి ఆధారంగా రాయితీలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్‌లకు రూ.49 కోట్లు ఉన్నాయని మంత్రికి ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ వివరించారు. అదికాకుండా గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్‌లకు మరో రూ.11 కోట్లు ఉన్నట్లు మంత్రికి తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా కడప స్టీల్ ప్లాంట్ పూర్తి
వైఎస్సార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్ ప్లాంట్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న ఈ ఉక్కు కర్మాగారం పనులు వేగంగా చేస్తూనే భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పిలిచిన అంతర్జాతీయ టెండర్లలో బ్రిటన్‌కు చెందిన లిబర్టీ స్టీల్ ఎల్1గా నిలిచిందని, కానీ ఇంకా ఆ కంపెనీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్1గా నిలిచిన తర్వాత లిబర్టీ స్టీల్‌తో కేవలం చర్చలు, ప్రతిపాదనలు మాత్రమే జరిగాయన్నారు. ఇంతలో ఆ సంస్థకు ఆరి్థక సాయం అందించే మరో సంస్థ కష్టాల్లో చిక్కుకుందని తెలిసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment